‘మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది’ అనే సూత్రంపైనే ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆధారపడి ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందే ప్రతిపక్ష నేతగా ఈ సూత్రాన్ని బలంగా నమ్మిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేశారు. నా అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ప్రధాన లక్ష్యమని చెబుతూ మేనిఫెస్టోలో చెప్పినట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మూడు పథకాల ద్వారా అందిన రూ.38,273.95 కోట్ల (తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు) సొమ్ముతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు సొంత వ్యాపారాలు ప్రారంభించి, ఆర్థిక కష్టాల సుడిగుండం నుంచి తమ కుటుంబాలను ఒడ్డున పడేశారు. వెరసి బ్యాంక్ లావాదేవీలు ఊపందుకున్నాయి. గ్రామీణ ఆర్థిక చక్రం వేగంగా తిరిగింది. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది.
ఎల్లుండి నుంచి ఆఖరి విడత ‘వైఎస్సార్ ఆసరా’
గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570. 80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని ఆఖరి నాలుగో విడతగా మంగళవారం నుంచి నేరుగా వారికే చెల్లించబోతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
సాక్షి, అమరావతి : వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 79 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల జీవితాల్లో సమూల మార్పులకు, వారి ఆత్మగౌరవానికి వైఎస్ జగన్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారా వారి ఆర్థిక కష్టాలు తీర్చింది. అంతటితో ఆగకుండా వారు సొంతంగా వివిధ వ్యాపారాలు ప్రారంభించేలా చేయి పట్టుకుని నడిపించింది. పాడి పశువులు, మేకలు, గొర్రెల పెంపకానికి ఊతం అందించింది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అందిన సహకారంతో అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడగలిగారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పరిస్థితి అగమ్యగోచరం.
డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. తీరా గద్దెనెక్కాక ఆ హామీని తుంగలో తొక్కారు. దీంతో ఆ సంఘాలన్నీ అప్పుల్లో కూరుకుపోయాయి. వీరి దుస్థితిని తన పాదయాత్రలో గమనించిన వైఎస్ జగన్.. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో ఉన్న రూ.25,570.80 కోట్ల అప్పును మనందరి ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. ‘ఆసరా’ పథకం పేరుతో నాలుగు విడతల్లో చెల్లిస్తామని చెప్పారు.
ఆ మాట మేరకు ఇప్పటికే మూడు విడతలుగా రూ.19175.97 కోట్ల సొమ్ము చెల్లించారు. దీనికి తోడు చేయూత పథకం కింద రూ.14,129 కోట్లు లబ్ధి చేకూర్చారు. సున్నా వడ్డీ పథకం కింద రూ.4,969 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రూ.38,274 కోట్లు లబ్ధి కలిగించారు. తద్వారా ఇప్పుడు ఆ పేదింటి పొదుపు సంఘాల మహిళలు రాష్ట్ర ఆర్థిక వ్యవçస్థకే ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగారు. ఐదేళ్ల క్రితం బ్యాంకుల వద్ద ఎన్‌పీఏలుగా ముద్రపడిన లక్షలాది పొదుపు సంఘాలు నేడు బలపడ్డాయి. గత చంద్రబాబు ప్రభుత్వం మ«ధ్యలో ఆపేసిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేస్తూ.. సకాలంలో బ్యాంకులకు రుణాలు చెల్లించే పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ డబ్బులను ప్రభుత్వమే ఏ ఏడాదికి ఆ ఏడాదే చెల్లిస్తుండడంతో ఇప్పుడు వందకు 99.83 శాతం పొదుపు మహిళలు అప్పును సకాలంలో చెల్లిస్తున్నారు.
దీంతో పొదుపు సంఘాల మహిళలకు చాలా తక్కువ వడ్డీకే ఎంతైనా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు గత 56 నెలల కాలంలో రూ.1,54,929.92 కోట్లు బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలకు రుణాలుగా అందజేశాయి. 83 శాతం సంఘాలు రూ.ఐదు లక్షలకు పైబడే రుణాలు తీసుకోగలిగాయి. అంటే దాదాపు ప్రతి పొదుపు సంఘం మహిళ గత 56 నెలల కాలంలో ఏడాదికి దాదాపు రూ.50 వేల చొప్పున కొత్త రుణం అందుకోగలిగారు. తీసుకున్న అప్పును కూడా మహిళలు తమ కుటుంబ ఆదాయాలు పెంచుకోవడానికే ఉపయోగించుకుంటున్నారు.
పెట్టుబడి పెట్టగలిగేలా ప్రోత్సాహం
ప్రపంచంలోనే ఎక్కువ జనాభాకు తోడు పేదరికం కలిగిన మన దేశం ఆర్థికాభివృద్ధిలో ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకోవాలంటే ప్రజల్లో పెట్టుబడి పెట్టగలిగే స్థాయి పెరగాలి. అంటే ఆ పెట్టుబడి ఏదో రూపంలో వారికి అందాలి. తద్వారానే దేశ ఆర్థికవృద్ధి చక్రం ముందుకు కదులుతుంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వాల నుంచే ప్రత్యేకించి పేద ప్రజలకు రకరకాల రూపాల్లో డబ్బులు చేరాల్సి ఉంటుంది.
ఈ పరంపరలోనే రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ మహిళలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్నారు. తద్వారా వారు ఆ డబ్బులను పూర్తి స్థాయిలో తమ కుటుంబ ఆదాయం పెంచే మార్గాల్లో తిరిగి పెట్టుబడి పెట్టేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మహిళలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ తమ కుటుంబ స్ధిర ఆదాయాలు పెంచుకోవడానికి వినియోగించుకుంటున్నారు. వెరసి రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి పెరుగుదలలో భాగస్వాములవుతున్నారు.
– ఆచార్య ఎం.ప్రసాదరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్
54 శాతం మందికి అదనంగా రూ.60 వేల ఆదాయం
పొదుపు సంఘాల మహిళల ఐదేళ్ల క్రితం నాటి మొత్తం అప్పు రూ.25,570.80 కోట్ల అప్పును వైఎస్సార్ ఆసరా పథకంలో నాలుగు విడతల్లో నేరుగా అందజేçయడంతో పాటు ఆ డబ్బులను మహిళలు దేనికైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి తోడు అదనంగా పెద్ద ఎత్తున బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గత 56 నెలల కాలంలో వ్యాపారాలు బాగా పెరిగాయి. పేద కుటుంబాల్లో టర్నోవర్ పెరిగింది. దీంతో గ్రామాల్లో రూ.వందకు నెలకు రూ.2 లేదా రూ.3 వడ్డీ వ్యాపారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
లక్షల పేద కుటుంబాల్లో ఇటీవల కొత్తగా ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండానే తమ పిల్లలకు మంచి ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. చాలా కుటుంబాలు అప్పు తీసుకొనే అవసరం లేకుండానే వ్యవసాయ పెట్టుబడులు మ కూర్చుకోగలుగుతున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89.29 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతుండగా.. వారిలో సగానికి పైగా అంటే 54 శాతం మంది మహిళల నెల వారీ సరాసరి స్థిర ఆదాయం రూ.5 వేలకు పైనే అదనంగా పెరిగింది. అంటే ఏడాదికి రూ.60 వేలకు పైబడి అదనపు ఆదాయం చేకూరుతోంది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల దేశ వ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళల జీవనోపాధుల స్థితిగతులపై నిర్వహించిన ఓ సర్వేలోనే ఈ విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 14,01,519 మంది పేదింటి పొదుపు సంఘాల మహిళలు ఏటా కనీసం లక్ష రూపాయల చొప్పున స్ధిర ఆదాయం పొందుతూ కొత్తగా లక్షాధికారులుగా మారిపోయారు. 31,04,314 మంది పేదింటి పొదుపు మహిళలు నెలవారీ రూ.5 వేల నుంచి రూ.8 వేల మధ్య ఆదాయం పొందుతూ ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.లక్ష మధ్య ఆదాయం పొందుతున్నారు.
నాడు బాబు హామీ నమ్మి దివాలా
2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,203.58 కోట్ల మేర అప్పులున్నాయి. ఆ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు నుంచే.. ‘తెలుగుదేశం పార్టీ డ్వాక్రా రుణ మాఫీ చేస్తుంది.. బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలను ఎవరూ చెల్లించొద్దు.. బ్యాంకుల్లో కుదువ పెట్టిన మీ బంగారాన్ని విడిపించేస్తాం’ అని చంద్రబాబు ఊరూరా ప్రచారం చేశారు. అంతకు ముందు వరకు కిస్తీల రూపంలో సకాలంలో బ్యాంకులకు రుణాలు చెల్లించే అలవాటు ఉన్న లక్షలాది మంది మహిళలు చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకులకు కిస్తీలు చెల్లించడం మానేశారు. మాయ మాటలు చెప్పిన అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదు.
అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీతనే అసెంబ్లీలో తమ (టీడీపీ) ప్రభుత్వం డ్వాక్రా రుణ మాఫీ అమలు చేయలేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. దీంతో పొదుపు సంఘాల మహిళలందరూ అప్పట్లో తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీలపై వడ్డీలు పెరిగిపోయాయి. పేద మహిళలందరూ కోలుకోలేనంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాధారణంగా గ్రామాల్లో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని చెల్లించకపోతే దివాలా తీశారని ప్రచారం చేస్తుంటారు.. అలా, అప్పుడు బ్యాంకుల్లో అప్పులు ఉన్న మహిళలు ప్రతి ఐదుగురిలో ఒకరిని బ్యాంకులు ఎన్‌పీఏ (నాన్ పెర్‌ఫార్మింగ్ అసెట్ – ఒక రకంగా దివాలా) జాబితాలో పెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment