
సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు 59 అవార్డులను ప్రకటించింది. వీటిల్లో 29 వైఎస్సార్ జీవిత సాఫల్య, 30 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలున్నాయి. అయితే కోవిడ్ కారణంగా పురస్కారాల ప్రదానం వాయిదా పడిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీటిని ప్రదానం చేయనున్నారు.
వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసినట్టు సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు. విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్‌తో పాటు అసామాన్య ప్రతిభ కనబరచిన సామాన్యులను సైతం గుర్తించి హైపవర్ స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఈ అవార్డులకు ఎంపిక చేశామన్నారు. వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ అందజేయనున్నారు. వైఎస్సార్ సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, వైఎస్సార్ కాంస్య ప్రతిమ (జ్ఞాపిక), మెడల్, శాలువ బహూకరిస్తారు.