సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని రీతిలో అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించి సామాజిక మహా విప్లవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజన తర్వాత టీడీపీ హయాంలో జరిగిన సామాజిక అన్యాయం, గత మూడేళ్లుగా ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని చాటి చెప్పేలా ఈనెల 26 నుంచి 29 వరకూ 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులతో బస్సు యాత్ర చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
సామాజిక న్యాయంతో సమాజంలోకి..
‘సామాజిక భేరి’ బస్సు యాత్ర ఈనెల 26న ఉత్తరాంధ్రలో ప్రారంభమై ముఖ్యమైన నగరాలు, పట్టణాలు, ప్రాంతాల మీదుగా సాగుతూ 29వ తేదీన అనంతపురం చేరుకుని అక్కడే ముగుస్తుంది. బస్సు యాత్ర సందర్భంగా నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే 30వ తేదీతో మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సామాజిక న్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.
అమ్మ ఒడి.. విద్యాకానుక, విద్యా దీవెన పథకాల ద్వారా భావి తరానికి ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తుండటం.. వైఎస్సార్ ఆసరా, చేయూత తదితర పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబనకు దోహదం చేయడం.. మంత్రివర్గం, చట్టసభల నుంచి స్థానిక సంస్థల వరకూ దామాషా ప్రకారం పదవులివ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల సామాజిక సాధికారతకు చిత్తశుద్ధితో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరించి ఆశీర్వాదం తీసుకోవాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల మద్దతుతో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.29 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం వైఎస్ జగన్ సామాజిక మహావిప్లవానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే.
సామాజిక న్యాయమంటే ఇదీ..
► 2019 జూన్ 8న తొలిసారిగా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 14 పదవులు (56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం వైఎస్ జగన్ చాటి చెప్పారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులకుగానూ నాలుగింటిని ఆ వర్గాలకే ఇచ్చారు. దేశంలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళను నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా జకియా ఖానంలకు అవకాశం కల్పించారు.
► ఈ ఏడాది ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఏకంగా 17 మంది(70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించి సామాజిక న్యాయ సాధనలో సరికొత్త చరిత్ర లిఖించారు.
వెన్నుపోటు... వెన్నుదన్ను
► టీడీపీకి బీసీలే వెన్నెముకని తరచూ చెప్పే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అధికారంలో ఉన్నప్పుడు 42 మందితో కూడిన మంత్రివర్గంలో కేవలం తొమ్మిది (21 శాతం) పదవులను మాత్రమే బీసీలకు ఇచ్చారు. విభజన తర్వాత 2014–19 మధ్య 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో కేవలం ఎనిమిది (32 శాతం) పదవులను మాత్రమే చంద్రబాబు బీసీలకు కేటాయించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా బీసీలకు పది పదవులు (40 శాతం) ఇవ్వడం గమనార్హం.
► తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఆ వర్గాల వెన్నెముక విరిస్తే.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ సీఎం జగన్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఇదే అంశాన్ని బస్సు యాత్ర ద్వారా మంత్రులు వివరించనున్నారు.
ద్రోహులెవరు?.. న్యాయం చేస్తున్నదెవరు?
► స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది.
► రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ దాన్ని ఆచరించి చూపి పదవులు ఇచ్చారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జడ్పీలను వైఎస్సార్ సీపీ దక్కించుకోగా తొమ్మిది జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్ సీపీ 635 అధ్యక్ష పదవులను సాధించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67 శాతం కేటాయించారు. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయగా ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో వైఎస్సార్ సీపీ 84 సాధించగా చైర్‌పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. ఈ అంశాలను బస్సు యాత్ర ద్వారా వివరించాలని మంత్రులు నిర్ణయించారు.
► చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేలా వైఎస్సార్ సీపీ రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రజలకు మంత్రులు వివరించనున్నారు.
రాజ్యసభలో నాడు – నేడు ఇలా
రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఏ ఒక్కరికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవకాశం కల్పించలేదు. మరోవైపు 2019 నుంచి ఇప్పటివరకూ ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా నాలుగు సీట్లు (50 శాతం) బీసీ వర్గాలకే కేటాయించి బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్ అని చాటి చెప్పారని రాజకీయ పరిశీలకులు ప్రశంసిస్తుండటాన్ని బస్సుయాత్ర ద్వారా మంత్రులు వివరించనున్నారు.
శాసనమండలిలో వైఎస్సార్ సీపీకి 32 మంది సభ్యులుండగా 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించడాన్ని ప్రస్తావించనున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఆ వర్గాలకే రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేస్తుండటాన్ని ప్రజలకు గుర్తు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment