
పొలం వద్ద మేతకు గోవులను తీసుకెళ్తున్న గురుమూర్తి తండ్రి మునికృష్ణయ్య
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యులకే పెద్దపీట వేస్తున్నారు. అందుకు నిదర్శనమే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఎం. గురుమూర్తి ఎంపిక. అక్కడి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎం.గురుమూర్తి పేరును సీఎం ప్రకటించి అన్ని రాజకీయ పార్టీలకూ షాక్ ఇచ్చారు. దీంతో గురుమూర్తి ఎవరన్నదీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సోమవారం నెల్లూరులో నామినేషన్ వేయనున్న గురుమూర్తి నేపథ్యం ఇదీ..
గురుమూర్తి దంపతులకు స్వగృహం ముందు హారతి ఇస్తున్న ఆయన సోదరీమణులు
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మారుమూల గ్రామమైన మన్నసముద్రం దళితవాడకు చెందిన గురుమూర్తిది సామాన్య కుటుంబం. తండ్రి మునికృష్ణయ్య రెండెకరాల ఆసామి. అది కూడా 1975లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిందే. ఈ భూమికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పట్టా ఇచ్చారు. ప్రస్తుతం అందులో మామిడి సాగుచేస్తున్నారు. గురుమూర్తి తల్లి రమణమ్మ గృహిణి. ఐదుగురు అక్క చెల్లెళ్లు్ల ఉన్నారు. ఐదో తరగతి వరకు మన్నసముద్రంలో ప్రాథమిక, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చదువుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరిపీ పూర్తి చేశారు.
ఆ సమయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని తరచూ వెళ్లి కలిసేవారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. 2017లో వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో ఆయన వెంటే ఉన్నారు. తిరుపతి ఉపఎన్నిక రావడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గురుమూర్తి పేరును సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇది తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ సామాన్యులకు పెద్దపీట వేస్తున్నారని వినేవారమే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.ఎంపీ అభ్యరి్థగా తమ కొడుకుని సీఎం ఎంపిక చేస్తారని ఊహించలేదని గురుమూర్తి తల్లిదండ్రులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment