అద్దె కట్టే స్థోమత లేదు..సొంతిళ్లు కట్టించారు
నా పేరు లక్ష్మీ దేవి, మాది కడప నగరం నానాపల్లె. నెలకు రూ. 5వేలు అద్దె కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పిల్లలను రెక్కల కష్టంపై పోషించుకుంటూ ఉండేవాళ్లుం. మాకు సొంతిళ్లు సమకూరుతుందా అని అనుకునే వాళ్లం. జగనన్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇంటి స్థలం మంజూరు చేశారు. అందులో ఇళ్లు కట్టుకొని అనందంగా ఉన్నాం.
జగనన్న మేలు మరిచిపోలేం
నాపేరు రేష్మా. మాది కడపలోని బిస్మిలా నగర్. నా భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తు.. భారమైనా ఇంటికి అద్దె కట్టుకుంటూ వచ్చాం. జగనన్న పుణ్యమా అని లక్షల విలువ చేసే స్థలం ఇచ్చారు. ప్రభుత్వం రూ. 1.80 లక్షలు మంజూరు చేసింది. ఎస్‌ఆర్‌జీఈఎస్ ద్వారా రూ.30 వేలు, డ్వాక్రా సంఘం నుంచి రూ. లక్ష వడ్డీ రాయితీపై రుణం ఇచ్చారు. ఈ నగదుతో ఇళ్లు కట్టుకున్నాం. దాదాపు రూ. 10 లక్షల విలువైన ఇంటికి యజమానిని చేసిన జగనన్న మేలు మరచిపోలేం.
జగననన కాలనీల్లో సౌకర్యాలు బాగున్నాయి
నాపేరు అయేషా. మాది కడప నగరం, బిస్మిల్లా నగర్ .ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకు ఇంటి స్థలం ఇచ్చి అదుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పటికీ మరచిపోలేం. అన్ని రకాల సౌకర్యాలతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి అదుకున్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: చిరు సంపాదనతో అద్దె చెల్లిస్తూ అవస్థలు పడే పేద వాడి గుండెలో సంబరం గూడు కట్టుకుంది. వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజం చేశారు.జిల్లాలోని 529 జగనన్న కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం, విద్యుత్ లైన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి పేద ప్రజల సొంతింటి కలను సాకారంచేసేలా కృషి చేస్తోంది.దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని 529 జగనన్న కాలనీల్లో 1,18,605 మందికి ఇంటి స్థలాలు
జిల్లాలో ఏర్పాటైన 529 జగనన్న కాలనీల్లో దాదాపు 1,18,605 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 68,808 గృహాలను రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోగా, 37,625 బేస్‌మెంట్ దశలో ఉన్నాయి. 25,625 గృహాలు బేస్‌మెంట్ పూర్తి చేసుకోగా,రూఫ్ లెవెల్‌లో 2789, రూఫ్ లెవెల్ పూర్తయినవి 2094 ఉన్నాయి. 595 గృహాలు పూర్తయ్యాయి. సొంత స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన వారిలో మొత్తం లబ్ధిదారులు 30,210 మంది ఉండగా, 7586 గృహాలు బేస్‌మెంట్‌లోపు ఉన్నాయి. 4676 బేస్‌మెంట్ పూర్తి చేసుకున్నాయి. రూఫ్ లెవెల్‌లో 3010, రూఫ్ పూర్తయిన గృహాలు 5354 ఉన్నాయి. అలాగే 6129 గృహాలు పూర్తయ్యాయి.
కొత్త ఊర్లను తలపిస్తున్న గృహ సముదాయాలు
జగనన్నకాలనీలోని గృహసముదాయాలు కొత్త ఊర్లను తలపిస్తున్నాయి. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిస్థలాలు అందజేయడంతో వాటిని నిర్మించుకునే పనిలో లబ్ధిదారులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వం విలువైన స్థలాలను అందజేయడంతో ప్రజలు ఆనందంగా తమ ఇళ్లను నిర్మించుకుంటున్నారు.
పేదల కళ్లలో కనిపిస్తున్న అనందం
ఇన్నాళ్లు అద్దె ఇళ్లలో బాడుగకు ఉంటూ కాలాన్ని వెళ్లదీస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు ఉచితంతోపాటు స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ. 30 వేలు, డ్వాక్రా రుణం కింద మరో రూ. లక్ష రుణాన్ని వడ్డీ రాయితీతో మంజూరు చేశారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన రీతిలో ఇంటి నిర్మించుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment