సాక్షి, అమరావతి: అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపచేయడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని గిరిజన రైతులకు గత రెండున్నరేళ్ల కాలంలో మూడు పర్యాయాల్లో రూ.750 కోట్ల మేర నేరుగా వారి ఖాతాలకే ప్రభుత్వం జమ చేసింది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున రైతు భరోసా ఇస్తున్న సంగతి తెల్సిందే.
సొంత భూమి కలిగిన ఆసామికే కాకుండా అటవీ హక్కుల పట్టా (ఆర్వోఎఫ్‌ఆర్)లను పొందిన వారికి కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2008 నుంచి 2021 నవంబర్ వరకు రాష్ట్రంలో 2,34,827 మంది గిరిజనులకు 4,79,105 ఎకరాలను పట్టాలుగా అందించడం జరిగింది. వాటిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో 1,32,084 మంది గిరిజనులకు 2,44,827 ఎకరాలకు సాగు హక్కు పత్రాలు (పట్టాలు) అందించడం దేశంలోనే రికార్డుగా నిలిచింది. దీంతోపాటు సాగుకు సాయమందిస్తూ వారికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ను ప్రభుత్వం వర్తింపజేసింది.
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను
ప్రభుత్వం నాకు రెండెకరాల భూమికి హక్కు పత్రం (ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా) ఇచ్చింది. దాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. భూమి పట్టా ఇవ్వడంతోపాటు ‘రైతు భరోసా’ అందిస్తున్న ప్రభుత్వం నా కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటాను.
– పలాసి మోహనరావు, కోడా పుట్టు గ్రామం, విశాఖ జిల్లా.
భూమి పట్టా ఇచ్చి సాగుకు ఊతం
మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ‘నవరత్నాలు’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పకుండా అమలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపజేశారు. గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడమే కాదు, ఆ పట్టాలు ఇచ్చిన భూముల్లో సాగుకు ‘రైతు భరోసా’తో ఊతమివ్వడం జరుగుతోంది. దీని వల్ల గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి.
– పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి
గిరిజన రైతుకు ‘హక్కు’తో పాటు ‘భరోసా’
Published Sun, Jan 2 2022 4:59 AM | Last Updated on Sun, Jan 2 2022 4:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment