చేతల సర్కారు.. చేవ చూపారు | YSR zero interest beneficiaries comments in video conference with CM Jagan | Sakshi
Sakshi News home page

చేతల సర్కారు.. చేవ చూపారు

Published Wed, Apr 21 2021 3:20 AM | Last Updated on Wed, Apr 21 2021 3:20 AM

YSR zero interest beneficiaries comments in video conference with CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ఇప్పుడు రైతులపై నమ్మకంతో బ్యాంకులు విరివిగా రుణాలిస్తున్నాయి. సకాలంలో రుణాలను తిరిగి చెల్లిస్తుండటంతో మాపై గురి కుదిరింది. కౌలు రైతులకు సైతం రుణాలు అందుతున్నాయి. ఏది కావాలన్నా మా గ్రామంలోని ఆర్‌బీకేల్లోనే దొరుకుతున్నాయి. పనులు మానుకుని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి తప్పింది...! మీది చేతల ప్రభుత్వం.. చేవ కలిగిన ప్రభుత్వం..! వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ లబ్ధిదారులైన రైతుల సంతోషం ఇదీ. మంగళవారం సీఎం జగన్‌తో వీడియోకాన్ఫరెన్స్‌లో పలు జిల్లాలకు చెందిన రైతులు మాట్లాడారు. 

ఆయిల్‌ పామ్‌ రైతులను ఆదుకున్న తొలి సీఎం మీరే
దేశంలో ఆయిల్‌ పామ్‌ రైతులను ఆదుకున్న తొలి సీఎం మీరే. ధర లేక నష్టాల పాలవుతున్న ఆయిల్‌ పామ్‌ రైతులకు రూ.80 కోట్లు కేటాయించి ఆదుకున్నారు. మాకు ఈ రోజు వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద రూ.3,900 వచ్చింది. రైతుభరోసా కింద అందిస్తున్న సాయంతో పెట్టుబడి అవసరాలు తీర్చుకుంటున్నాం. ఈ డబ్బుతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నాం. రుణాలు సక్రమంగా చెల్లించడం వల్ల అదనంగా వడ్డీ రాయితీ లభిస్తోంది. బ్యాంకుల వద్ద పరపతి పెరుగుతోంది. ఇప్పుడు బ్యాంకులు మాకు రెండు ఎకరాలకు రూ.లక్ష వరకు రుణం ఇస్తామని చెబుతున్నాయి. రైతులకు చాలా సౌలభ్యంగా ఉండేలా పరిపాలన చేస్తున్నారు.     
–దాట్ల వెంకటపతి, రాజానగరం మండలం, కల్వచర్ల గ్రామం, తూర్పు గోదావరిజిల్లా

తొలిసారి లోన్‌ వచ్చింది..
సొంత భూమితో పాటు ఐదు ఎకరాలు కౌలుకు చేస్తున్నా. 2019లో ప్రభుత్వం కౌలు రైతుకార్డు ఇవ్వడంతో బ్యాంకు ద్వారా రూ.60 వేల రుణం తీసుకుని సకాలంలో చెల్లించా. రూ.2,400 వడ్డీ రాయితీ రావడం చాలా సంతోషంగా అనిపించింది. కౌలుదారులకు ఎక్కడా రుణాలివ్వరు. మొదటిసారి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో మాకు లోన్‌ వచ్చింది. సున్నావడ్డీ కింద ఇప్పుడు వడ్డీ రాయితీ అందింది. రూ.90 వేలకుగానూ రూ.3,600 చొప్పున మా కుటుంబానికి వడ్డీ రాయితీ వచ్చింది. నోటిఫైడ్‌ పంటల్లో మినుము, పెసర కూడా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.   
 – శ్రీనివాసరెడ్డి, కౌలురైతు, వల్లూరు మండలం, వైఎస్సార్‌ కడప జిల్లా

కౌలు రైతుల కళ్లల్లో వెలుగులు..
రైతు కళ్లలో వెలుగులు చూడాలని తపిస్తున్న మీరు ఎప్పుడూ సీఎంగా వుండాలి. సహకార సంఘం ద్వారా రూ.98 వేలు రుణం తీసుకుని సకాలంలో చెల్లించడంతో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద వడ్డీ రాయితీ రూపంలో నాకు తాజాగా రూ.3,620 వచ్చాయి. మా కుటుంబానికి వడ్డీ రాయితీ కింద దాదాపు రూ.12 వేల మేరకు లబ్ధి కలుగుతోంది. బ్యాంకుకు వెళ్లకుండానే వడ్డీ రాయితీ గురించి ఆర్బీకేల్లోని జాబితా చూసుకుంటే వివరాలు తెలుస్తున్నాయి. గతంలో వడ్డీ రాయితీ వర్తిస్తుందో లేదో తెలిసేది కాదు. ఇప్పుడు ఆర్బీకే వద్దకు వెళ్తే చాలు. మీది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.
    – గాజుల మాధవరావు, బందరు మండలం, పొట్లపాలెం గ్రామం, కృష్ణా జిల్లా

నమ్మకంతో రుణాలు అందిస్తున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన సున్నావడ్డీ రైతుల పాలిట వరం. దీనిద్వారా రైతులు సకాలంలో రుణాలు పొంది సకాలంలో జమ చేస్తున్నారు. దీనివల్ల రైతులకు, బ్యాంకులకు మధ్య నమ్మకం ఏర్పడింది. నేను బ్యాంకుల నుంచి రూ.30 వేలు పంట రుణం పొందా. దాని కింద సుమారు రూ.1,100 వడ్డీ రాయితీ ఇప్పుడు అందుతోంది. అప్పు చేయాల్సిన పని లేకుండా రైతుభరోసా డబ్బులతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేలోనే కొనుగోలు చేస్తాం. పంట వేసిన నాటి నుంచి గిట్టుబాటు ధరకు అమ్ముకునే వరకు రైతుభరోసా కేంద్రాలు సాయం చేస్తున్నాయి. 
– ప్రవీణ్‌కుమార్, ఆముదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement