పవర్ సెక్టార్‌పై లోకేశ్ చర్చ జరగనివ్వలేదు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల మండిపాటు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం బడ్జెట్‌పై జరిగిన చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. తాము మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, బొమ్మి ఇజ్రాయెల్, సిపాయి సుబ్రమణ్యం, పీవీవీ సూర్యనారాయణరాజు, వంకా రవీంద్రనాథ్ మాట్లాడారు. వారు ఏమన్నారంటే..
మంత్రులందరూ అడ్డుకున్నారు..
మండలిలో బడ్జెట్‌పై మాట్లాడుతుంటే వాస్తవాలు భరించలేని అధికారపక్ష నేతలు అడుగడుగునా మమ్మల్ని అడ్డుకున్నారు. టారిఫ్ పెంచబోతున్నారా అని ఎనర్జీ మీద ప్రశ్నోత్తరం ఇచ్చాం? కానీ, దానిపై చర్చ జరగలేదు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఒక్కో యూనిట్‌కు రూ.1.50 పైసలు పెంచుతున్నారు.
ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వమే దీనిని భరించాలి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటూ నెట్టుకొచ్చి ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ అంటున్నారు. బడ్జెట్‌పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే లోకేశ్ చర్చను తప్పుదారి పట్టించారు. సోషల్ మీడియాలో పోస్టులపై చర్చ కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు ఇలా వ్యవహరిస్తున్నారు. – తోట త్రిమూర్తులు
ప్రజలను ప్రభుత్వం మోసం చేసింది..
ప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. బడ్జెట్లో జరిగిన తప్పులను లేవనెత్తడం ప్రతిపక్షంగా మా బాధ్యత. మా సభ్యులు మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డుతగులుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలుచేయాలంటే రూ.74 వేల కోట్లకు పైగా అవసరమవుతాయి.
కానీ, అందుకు తగిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఈ బడ్జెట్‌తో ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. మూడు సిలిండర్లు ఇస్తామని ఒక్కటే ఇచ్చారు.. మరో 2 సిలిండర్ల మాటేంటి? రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలూ ఇవ్వడంలేదు.
ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా? అరకొర బడ్జెట్ కేటాయించి సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలుచేస్తారు? మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. – వరుదు కళ్యాణి
ఈరోజు మండలి చూస్తే బాధేసింది..
ఈరోజు మండలిలో జరిగిన పరిస్థితులను చూస్తే బాధేసింది. విజయనగరం జిల్లాలో అతిసార వ్యాప్తి, మరణాలపై ప్రశ్నోత్తరం ఇచ్చాం. జిల్లాలో డయేరియా వ్యాప్తి వాస్తవమేనా అంటే వైద్య మంత్రి లేదన్నారు. మొత్తం 14 మరణాలు సంభవిస్తే డిప్యూటీసీఎం పవన్ 10 మంది చనిపోయారని.. చంద్రబాబు 8 మంది చనిపోయారన్నారు. నిన్న మంత్రి సభలో నలుగురు చనిపోయారంటున్నారు. సభ్యుల ఆవేదన చూస్తే ముచ్చటేస్తోందని మంత్రి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం బాధాకరం. –పీవీవీ సూర్యనారాయణ రాజు
బాబు పాలనంతా తిరోగమనమే..
సభలో ఎవరైనా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పుచేసిందన్నారు. కానీ, బడ్జెట్లో రూ.6 లక్షల కోట్లు మాత్రమే చూపించారు.. ఇది మోసం కాదా? బాబు పాలనంతా తిరోగమనమే. వైఎస్సార్‌సీపీ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. – బొమ్మి ఇజ్రాయెల్
విపక్షాల గొంతు నొక్కుతున్నారు..
మండలిలో ప్రస్తుతం మేం మెజార్టీ సభ్యులం. అయినా కూడా సభా పద్ధతులు పాటించకుండా టీడీపీ మంత్రులు గందరగోళం సృష్టిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించకపోతే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు. సూపర్ సిక్స్‌లో ప్రతీ రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంటే 11 వేల కోట్లు.. కానీ, కేటాయించింది వెయ్యి కోట్లే. ఇది మోసం కాదా? ఇక ఉచిత బస్సు ఏమైంది? – సిపాయి సుబ్రహ్మణ్యం
సమయం కూడా ఇవ్వలేదు..
నాకు కేటాయించిన సమయం ఇవ్వకుండానే సభను రేపటికి వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యులపై దాడిచేసే ప్రయత్నం చేశారు. ఎంతో విలువైన 4 గంటలు వృథా అయిపోయాయి. మాలాంటి కొత్త ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం రావట్లేదు. కనీసం రేపైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. చంద్రబాబు నిత్యం మోసం, దగా చేస్తూ అబద్ధాలు చెబుతున్నారు. – వంకా రవీంద్రనాథ్
Comments
Please login to add a commentAdd a comment