
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి): వైఎస్సార్సీపీ ప్లీనరీకి హాజరైన వారితో అక్కడ ఏర్పాటు చేసిన 250 ఫుడ్‌కోర్టులు కిటకిటలాడాయి. రెండోరోజు ఉ.7 గంటల నుంచి అల్పాహారం అందించారు. సా.4 గంటలకే ప్లీనరీ ముగిసినా రాత్రి 7 గంటల వరకు ఫుడ్‌కోర్టులలో రద్దీ కొనసాగింది. దూర ప్రయాణాలు చేసేవారు డిన్నర్ కూడా చేసి బయల్దేరారు. రెండ్రోజులూ ఏ చిన్న అవాంతరమూ లేకుండా పసందైన వంటకాలు అందించడంపై సీఎం వైఎస్ జగన్, పార్టీ సీనియర్ నాయకులు వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు తమ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారని ఫుడ్ కమిటీ కన్వీనర్ డా. చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు.
చెవిరెడ్డిని అభినందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎంపీ విజయసాయిరెడ్డి
ప్లీనరీకి ముందురోజు నుంచి ముగిసేవరకు 3,400 మంది కేటరింగ్ వర్కర్లు రేయింబవళ్లు పనిచేశారని చెవిరెడ్డి వివరించారు. చివరిరోజైన శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటల పాటు ఆహారాన్ని అందించామన్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కార్యకర్త నుంచి మంత్రుల వరకు అందరికీ ఒకే మెనూను అమలుచేశామని.. మొత్తం 25 రకాల వంటకాలను వడ్డించామని ఆయన తెలిపారు. మొదటిరోజు 2 లక్షల మంది వరకు భోజనం అందించామని, రెండోరోజు దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది భోజనం చేశారని చెవిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment