శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభిస్తున్న వైవీ సుబ్బారెడ్డి
తిరుమల/చంద్రగిరి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శ్రీవారి మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం దెబ్బతిందని చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులు రూ.3.60 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేశారని తెలిపారు. ఈ మార్గం ద్వారా రోజూ ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారని వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు, శ్రీ కృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. అనంతరం సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ–2 జగదీశ్వర్‌రెడ్డి, ఈఈ సురేంద్రరెడ్డి, ఆర్‌ఆర్ బిల్డర్స్ డీజీఎం ఆర్ముగాన్ని వైవీ సుబ్బారెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో టీటీడీ సభ్యులు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, మొరం శెట్టి రాములు, జేఈవోలు సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని బుధవారం అర్ధరాత్రి వరకు 69,603 మంది దర్శించుకోగా.. 30,434 మంది తలనీలాలు ఇచ్చారు. హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. ఎలాంటి టోకెన్ లేకపోయినా దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
అన్నప్రసాద సేవలు ప్రారంభం
కోవిడ్ వల్ల 2020 మార్చిలో పీఏసీ–2 వద్ద నిలిపివేసిన అన్నప్రసాద సేవలను పునఃప్రారంభించారు. డిప్యూటీ ఈవోలు పద్మావతి, హరీంద్రనాథ్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి జీఎల్‌ఎన్ శాస్త్రి పాల్గొన్నారు. ఇదిలాఉండగా, కోల్‌కతాకు చెందిన సుమిత్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రకాష్ చౌదరి తిరుమలలో టీటీడీకి రూ.50 లక్షల విలువైన 10 బ్యాటరీ వాహనాలను విరాళంగా ఇచ్చారు.
అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment