మదనపల్లె మండలంలో సాగులో ఉన్న టమాటా పంట
మదనపల్లె : టమాటా పంటను రైతులు లాటరీ పంటగా పిలుస్తుంటారు. ఒక సీజన్‌లో ధర ఆకాశాన్నంటితే.. మరో సీజన్‌లో నేల చూపులు చూడటం, పెట్టుబడులు అధికమై గిట్టుబాటు ధర రాలేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేయడం, పంటను పశువులకు మేతగా వదిలేయడం గతంలో జరిగేది. ఇకపై అలాంటి కష్టాలు ఉండవు. మార్కెట్లో ధరలు తగ్గినా..రైతుకు కనీస గిట్టుబాటు ధర లభించేలా, సాధారణ సాగుకంటే అధిక దిగుబడులు వచ్చేలా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ టమాటా రకాలను పండించేలా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అన్నమయ్య జిల్లాలో ప్రయోగాత్మకంగా నిమ్మనపల్లె, మదనపల్లె మండలాల్లో రబీ సీజన్‌లో రైతులతో సాగుచేయించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కోలార్, సీడ్ కాయగా రైతులు పిలుచుకునే ప్రాసెసింగ్ టమాటా రకాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రత్యేక కథనం..
అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా సాగయ్యే ఉద్యాన పంటల్లో టమాటా ఒకటి. జిల్లాలో సాధారణ పరిస్థితుల్లో రబీ సీజన్‌కు 12,500 ఎకరాలు టమాటా సాగవుతుంటే ప్రస్తుతం 3,950 ఎకరాల్లో సాగుచేశారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్ 10 వరకు టమాటా విరివిగా సాగుచేస్తారు. సంబేపల్లె, సుండుపల్లె, చిన్నమండ్యం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలోనూ, గుర్రంకొండ, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అధికంగా సాగు చేస్తారు. బి.కొత్తకోట, ములకలచెరువు, పీటీఎం మండలాలు జిల్లాలోనే టమాటా అత్యధికంగా సాగుచేసే ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో రైతుకు అండగా నిలిచేందుకు, కనీస గిట్టుబాటు ధర పొందేందుకు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్(ఏపీఐఎల్‌ఐపీ) ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రాసెసింగ్‌కు అనువైన టమాటా రకాలపై రైతులకు అవగాహన కల్పించాలని, మదనపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో ప్రయోగాత్మకంగా సాగుచేసేందుకు సంకల్పించింది. ప్రాసెసింగ్ టమాటా రకాలు కర్ణాటకలోని కోలార్, చింతామణి జిల్లాల్లో అక్కడి రైతులు అధికంగా సాగుచేస్తున్నారు. ఈ రకంలో విత్తనాలు తక్కువగా, కండశాతం ఎక్కువగా ఉండటం వల్ల జ్యూస్, సాస్ తయారీకి అనుకూలంగా ఉంటాయి. సాధారణ వాడకానికి ఉపయోగపడుతాయి. దీనిని అక్కడి రైతులు వాడుకభాషలో కోలార్ కాయ, సీడ్‌కాయ, జ్యూస్‌కాయగా పిలుస్తుంటారు. సాధారణ టమాటా రకాలతో పోలిస్తే దాదాపు 25శాతం అధిక దిగుబడులు, ఎక్కువ కాలం మన్నిక, మంచి రంగు, సైజు దీని ప్రత్యేకత.
ప్రయోగాత్మకంగా సాగు..
మదనపల్లె, నిమ్మనపల్లె మండలాల్లో ప్రాసెసింగ్ టమాటా ప్రయోగాత్మక సాగుకు ఉద్యానశాఖ అధికారులు 185 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుంటే 65 ఎకరాల్లో సాగుచేసేందుకు రైతులు ముందుకొచ్చారు. ఈ రకం సాగుచేసినందుకు రైతుకు పెట్టుబడి రాయితీగా ఒక ఎకరాకు రూ.21,400 సబ్సిడీ ఇస్తారు. కుప్పం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాసెసింగ్ రకాలైన సింజంటా–6242, అన్‌సోల్, జివెల్ రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఒక మొక్క విలువ రూ.1.25పైసలు అయితే ప్రభుత్వ సబ్సిడీ రూ.1 పోనూ 0.25 పైసలకు సరఫరా చేస్తున్నారు.మల్చింగ్ పేపర్‌కు రూ.6,400, ఐపీఎం కింద ఎకరాకు రూ.2,000, కాయలు వచ్చాక మార్కెట్‌కు తరలించేందుకు వీలుగా ఒకొక్కటి రూ.120 చొప్పున ఎకరాకు 40 ప్లాస్టిక్ క్రేట్ల వరకు రాయితీపై అందిస్తున్నారు. ఒక ఎకరాకు 8,000 మొక్కలు అవసరమవుతాయి. వీటిలో జివెల్ రకానికి అధికంగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ రకాలను కోలార్, చింతామణి మార్కెట్లలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అక్కడికి తరలించేందుకు వీలుగా ప్లాస్టిక్ క్రేట్లను రైతులకు రాయితీపై అందిస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.
రైతుకు గిట్టుబాటు ధర ..
టమాటాను సాగుచేసిన రైతు నష్టపోకూడదని, మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నా గిట్టుబాటు ధర పొందాలనే ఉద్దేశంతో ప్రాసెసింగ్ రకాలను ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడు ప్రాసెసింగ్ టమాటాను కనీసధర రూ.4–6 కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడి నష్టపోకుండా కొద్దిపాటి లాభాలతోనైనా రైతు ఊరటచెందే వీలుంటుంది. ఫిబ్రవరి 25 నుంచి నిమ్మనపల్లె, మదనపల్లె మండలంలో రైతులకు నారు సరఫరా చేస్తున్నాం.
– ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి, ఉద్యానశాఖ అధికారి, మదనపల్లె
దిగుబడులు అధికంగా వస్తాయి..
ప్రాసెసింగ్ టమాటా రకాలు సాధారణ పంటతో పోలిస్తే అధిక దిగుబడులు వస్తాయి. గత ఏడాది సీజన్‌లో వీటిని ప్రత్యేకంగా కోలార్ నుంచి తెప్పించి ఎకరా భూమిలో సాగుచేశాను. రూ.2లక్షల వరకు పెట్టుబడి ఖర్చు వచ్చింది. సుమారు 2,500 బాక్స్‌ల(ఒకొక్కటి 30కిలోలు) కాయ వచ్చింది. కోలార్ మార్కెట్‌కు తీసుకెళితే కిలో రూ.25 నుంచి 45 వరకు ధర పలికింది. పెట్టిన పెట్టుబడికి మూడురెట్లకు పైగా ఆదాయాన్ని పొందగలిగాను. ప్రస్తుతం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రాయితీపై సాగుచేసేందుకు ప్రోత్సాహకాలు అందించడం సంతోషంగా ఉంది.
– సుధాకర్‌రెడ్డి, మన్యంవారిపల్లె, నిమ్మనపల్లె మండలం
Comments
Please login to add a commentAdd a comment