గల్ఫ్‌ విమానాలు రన్‌వే పైకి చేరేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ విమానాలు రన్‌వే పైకి చేరేదెప్పుడో?

Published Thu, Aug 31 2023 12:28 AM | Last Updated on Thu, Aug 31 2023 10:26 AM

తిరుపతి ఎయిర్‌పోర్టు - Sakshi

తిరుపతి ఎయిర్‌పోర్టు

ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి అంతర్జాతీయ స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నది కలగానే మిగిలిపోతోంది. రాష్త్ర ప్రభుత్వం దృష్టి సారించినా కేంద్ర ప్రభుత్వం కనికరించలేదు. దీంతో ఉభయ వైఎస్సార్‌ జిల్లా నుంచి ఎడారి దేశాలకు విమానాల్లో తిరగవచ్చుననే గల్ఫ్‌ వాసుల కల నెరవేరడంలేదు.

రాజంపేట: రాయలసీమలో ప్రధానంగా ఉభయ జిల్లాల నుంచి ఎడారి దేశాలకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. రాజంపేట, రాయచోటి, కడప, బద్వేలు, రైల్వేకోడూరుతోపాటు ఉభయ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి 2 లక్షల మందికి పైగా ఎడారి దేశాలపై ఆధారపడి జీవిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా కువైట్‌, ఖతార్‌, దుబాయ్‌, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, అబుదాబీ, లెబనాన్‌, మస్కట్‌ దేశాలకు ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. మరింతమంది ఉద్యోగం, విద్య రీత్యా అమెరికా, కెనడా, సౌత్‌ ఆఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు వెళ్తున్నారు. వీరు విదేశీయానం చేయాల్సి వస్తే భాష రాని వివిధ రాష్ట్రాలలోని విమానాశ్రయాల వద్ద ఇబ్బంది పడుతున్నారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారిలో 60 శాతం మంది చదువు రాని వారు ఉండడంతో మోసాల పాలై జైళ్లలో మగ్గుతున్నారు.

గల్ఫ్‌ దేశాలకు విమానాలు ఎప్పుడో?
గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారు నాలుగు దశాబ్ధాల కిందట వారాలకొద్దీ సముద్రయానం చేసి ఎడారి దేశాలకు చేరుకునేవారు. గల్ఫ్‌ దేశాలలో పనిచేస్తే ఖరీదైన జీవితం సాగించవచ్చునని, తమ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావచ్చునని తెలియడంతో అనంతరం ప్రయాణం చేసే వారి సంఖ్య పెరిగింది. వీరంతా విమానాలపై ఆధారపడుతున్నారు. ఇది గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎడీసీఎల్‌(ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌) అంతర్జాతీయ సర్వీసులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేఉ్తన్నాయి. తిరుపతి, రాజంపేట లోక్‌సభ సభ్యులు తమ వంతుగా విమానాలను రన్‌వే మీదకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తిరుపతి నుంచి విదేశీయానంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కనికరించడం లేదు.

వ్యయప్రయాసలతో ప్రయాణం
చైన్నె, కర్ణాటక, ముంబయి, హైదరాబాద్‌, ఢిల్లీ నగరాలకు వెళ్లే వారు వ్యయ ప్రయాసలతో దూర ప్రాంతాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. అనేక మంది బాష రాక ఇబ్బందిపడుతున్నారు. కొందరైతే మోసపోతున్నారు. దూర ప్రయాణంతో అనేక అవాంతరాలు ఎదురై ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతేగాక విమాన టికెట్‌తోపాటు ఎయిర్‌పోర్టుకు చేరుకునే ఖర్చులు భరించాలంటే కష్టపడుతున్నారు. 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించారు. కానీ ఆ స్థాయిలో కేంద్రప్రభుత్వం విమానాలను తీసుకురాలేదనే అపవాదు ఉంది.

విదేశీ విమాన సర్వీసులను ప్రవేశపెట్టాలి
రాయలసీమ జిల్లా వాసులకు అందుబాటులో ఉండే తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి విదేశీ విమాన సర్వీసులను ప్రవేశపెట్టాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ వంతు కృషి చేస్తున్నారు. ఉభయ జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లాలంటే ఇతర రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. త్వరలో విదేశీయానం సులభతరం చేసే బాధ్యత కేంద్రంపై ఉంది.
– చొప్పా అభిషేక్‌రెడ్డి, ఈడీ, ఏఐటీఎస్‌, రాజంపేట

గల్ఫ్‌ విమాన సర్వీసులు తీసుకురావాలి
తిరుపతి నుంచే గల్ఫ్‌ విమానాల సర్వీసులు అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉంది. నిత్యం వందలాది మంది ఇతర రాష్ట్రాలలోని ఎయిర్‌పోర్టుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి తవిదేశీ విమానసర్వీసులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.
– గోవిందనాగరాజు, గల్ఫ్‌కో–కన్వీనర్‌, రాజంపేట

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement