కడప సిటీ : కడప విమానాశ్రయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రూ. 224.05 కోట్లతో న్యూ డొమెస్టిక్ బిల్డింగ్ నిర్మాణం, ఇతర పనులకు శ్రీకారం చుట్టేందుకు టెండర్లను కూడా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పిలిచింది. మరో మూడు నెలల్లో టెండర్లు పూర్తయి రెండేళ్ల కాలంలో అంటే మార్చి 2026కు పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.ఇప్పటికే నైట్ ల్యాండింగ్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్‌పోర్టును తీర్చిదిద్దనున్నారు.
రూ. 224.05 కోట్లతో పనులు
ఇటీవల ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కడప ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ. 224.05 కోట్ల నిధులు కేటాయించింది. ఈ మొత్తంతో 12,900 చదరపు మీటర్లలో న్యూ డొమెస్టిక్ టెర్మినల్ భవన నిర్మాణాన్ని అత్యాధునిక సౌకర్యాలతో చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను పిలిచారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి తరహాలో ఈ ఎయిర్‌పోర్టును సర్వాంగ సుందరంగా మార్చనున్నారు. మూడు ఏరో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇవి పూర్తయితే టెర్మినల్ భవనం నుంచి నేరుగా విమానంలోకి చేరుకునే అవకాశం ఉంటుంది. వర్షం వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు విమానం వద్దకు చేరుకోవచ్చు. ప్రస్తుతం బస్సు ద్వారా అక్కడికి చేరుకుంటారు.
పెద్ద విమానాలు వచ్చేందుకు అవకాశం
కడప విమానాశ్రయంలో పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నైట్ ల్యాండింగ్‌కు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతి వచ్చిన తర్వాత పనులన్నీ పూర్తయ్యాయి. రన్‌వే పెంపుతోపాటు రన్‌వే లైటింగ్, అప్రోచ్ లైటింగ్, పార్కింగ్ బే లైటింగ్, 2.5 కిలోమీటర్ల రన్‌వే, సెక్యూరిటీ, పెరిమీటర్ లైటింగ్, పెరిమీటరు రోడ్డు తదితర పనులు పూర్తయ్యాయి. దీంతో నైట్ ల్యాండింగ్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా విమానాలు దిగేందుకు అవకాశం ఉంటుంది.
8కొత్త టెర్మినల్ లో 700 మంది ప్రయాణికుల సౌకర్యం
ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనంలో 40+40 (80) మందికి మాత్రమే అవకాశం ఉంది. కొత్త టెరి్మనల్ పూర్తయితే మొత్తం 700 మందికి రాకపోకలు సాగించే అవకాశాలు ఉంటాయి. ఏడు విమానాలు పార్కింగ్ చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది. అభివృద్ది పనులు పూర్తయితే ఏ–320 (180మంది) ప్రయాణికులు ప్రయాణించే పెద్ద విమానాలు ఇక్కడి నుంచి నడిపేందుకు వీలు ఉంటుంది.
8పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు
కడప విమానాశ్రయంలో పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా పైలెట్ శిక్షణా కేంద్రం లేదు. ప్రప్రథమంగా కడప విమానాశ్రయంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చేనెల 25, 26 తేదీల్లో ఇందుకు సంబంధించి ప్రణాళిక ఖరారు కానుంది. తర్వాత ఈ శిక్షణా కేంద్రం పనులు చేపట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment