రైలుపల్లె.. రెడ్డిపల్లి | - | Sakshi
Sakshi News home page

రైలుపల్లె.. రెడ్డిపల్లి

Published Mon, Jan 22 2024 1:18 AM | Last Updated on Mon, Jan 22 2024 9:55 AM

- - Sakshi

వైఎస్సార్: చైన్నె–ముంబై రైలు మార్గంలో తొలుత ఏర్పడిన స్టేషన్‌ రెడ్డిపల్లి. రైలు రావడానికి కారణమైన పల్లె గనుక ఇప్పటికీ రైలు పల్లెగా ప్రసిద్ధి కెక్కింది. అయితే రైల్వేశాఖ ఈ రైల్వేస్టేషన్‌ ఆనవాళ్లు లేకుండా చేసిందనే విమర్శలను మూటకట్టుకుంది. దక్షిణ భారతదేశంలో తొలి రైల్వేస్టేషన్‌గా రెడ్డిపల్లిను చెప్పుకుంటారు. తర్వాత ఇక్కడి నుంచి నందలూరు వరకు రైలు మార్గం వేశారు. చెయ్యేరు నీరు శ్రేష్టమని భావించి రైలు ఇంజిన్ల నిర్వహణ కోసం లోకోషెడ్‌ నిర్మించేందుకు బ్రిటీషు రైల్వేపాలకులు ముందుకొచ్చారు.

► రెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌లో విక్టోరియా రాణి....
రెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌ వరకు రైల్వేట్రాక్‌ వేశారు. విక్టోరియా రాణి ఇక్కడికి వచ్చి దీనిని ప్రారంభించారు. రైల్వేమార్గం పురోగతిపై నాటి రైల్వేపాలకులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికీ రెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌ పరిధిలో రైల్వేకు ఎకరాల్లో స్థలం ఉంది. నిన్న మొన్నటివరకు బ్రిటీష్‌ రైల్వేపాలకుల చిహ్నాలు ఉండేవి.  

రాయపురం నుంచి.....
మద్రాసు, సందరన్‌ మరాఠా రైల్వేస్‌ పరిధిలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌ ప్రారంభమైంది. ఇక్కడి నుంచి తమిళనాడులోని రాయపురం వరకు 153 కిలోమీటర్లు రైల్వేట్రాక్‌ నిర్మించారు. ఇదంతా 1857 ప్రాంతంలో జరిగింది. దేశంలో తొలి రైలుమార్గం ముంబై–థానా మధ్య నిర్మితమైన క్రమంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌ వరకు ట్రాక్‌ నిర్మితమైందని సమాచారం. రైల్వేస్టేషన్‌ను పూర్తి బర్మా టేకుతో నిర్మించారు.

మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు.....
మద్రాసు నుంచి నేరుగా రెడ్డిపల్లి వరకు గూడ్స్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడిచేవి. బొగ్గుతో నడిచే రైలింజన్లతో రైళ్ల రాకపోకలను కొనసాగించారు. ఈ స్టేషన్‌లో మద్రాసు–రాయచూరు–రేణిగుంట–గుంతకళ్లు ప్యాసింజర్‌ రైళ్లు ఆగేవి. అరక్కోణం , కడప ప్యాసింజర్‌ రైళ్లు కూడా నిలిచేవి.

2003–2004 మధ్యలో రైల్వేస్టేషన్‌ మూసివేత
ఇండియా రైల్వేలో మీటర్‌గేజ్‌లను బ్రాడ్‌గేజ్‌లుగా మార్చడం.. సింగల్‌ లైన్‌ ఉన్న రైల్వేస్టేషన్‌ను డబుల్‌ లైన్‌ చేశారు. ఈ క్రమంలో 2003–2004లో స్టేషన్‌ను మూసివేశారు. స్టేషన్‌ మాస్టర్లను, పాయింట్‌మెన్‌లను అందరినీ బదిలీ చేశారు. తర్వాత కాంట్రాక్టు పద్దతిలో రైల్వే టికెట్లు ఇచ్చేందుకు బుకింగ్‌ రూమ్‌ నిర్మించారు. లెవెల్‌ క్రాసింగ్‌ గేటు బ్రిటీష్‌ కాలం నుంచి నేటి వరకు కొనసాగుతోంది.

స్టేషన్‌ మూసివేతకు ప్రధానంగా రెడ్డిపల్లికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో పుల్లంపేట రైల్వేస్టేషన్‌, ఏడున్నర కిలోమీటర్ల దూరంలో ఓబులవారిపల్లె స్టేషన్‌లు ఉన్నాయి. రైళ్లవేగం పెరిగిన క్రమంలో నాలుగు, ఐదు నిమిషాల్లో రైలు రెడ్డిపల్లి స్టేషన్‌ దాటి పోతుంది. ఆ స్టేషన్‌ ఉండటం వల్ల రైల్వేకు ఎలాంటి లాభదాయకం కాదని అప్పటి డీఆర్‌ఎం నివేదిక సమర్పించారు. దీంతో రైల్వేబోర్డు స్టేషన్‌ను మూసివేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. స్టేషన్‌ను మూసి వేయవద్దని కార్మికసంఘాలు చేసిన విజ్ఞప్తిని అధికారులు పెడచెవిన పెట్టారు.

 బ్రిటీషు రైల్వేపాలకుల హయాంలో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌ను కేంద్రంగా చేసుకొని ముంబై–చైన్నె రైలు మార్గం నిర్మించారు. ఈ స్టేషన్‌లో రెండు లైన్లు, ఒక ప్లాట్‌ఫామ్‌ ఉండేది. గూడ్స్‌ సైడింగ్‌ను కూడా బ్రిటీషర్లు ఏర్పాటు చేసుకున్నారు. 1980లో ఈ సైడింగ్‌ను మూసివేశారు. ఇక్కడి నుంచి గూడ్స్‌ వ్యాగన్‌లో కర్రబొగ్గు, ఎర్రగడ్డలు, తమలపాకు, నిమ్మకాయలు మద్రాస్‌ హార్బర్‌కు తీసుకెళ్లి అక్కడ నుంచి గోధుమలు, బార్లీ దిగుమతి అయ్యేవి.

భావితరాలకు తెలియాలి  
బ్రిటీషు కాలం నుంచి చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్లు గురించి, ఆనాటి పరిజ్ఞానం, రైళ్ల గురించి భావితరాలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇప్పుడు రైల్వే లాభాలు చూసుకుంటోంది. చరిత్ర కల్గిన స్టేషన్లు కాలగర్భంలో కలిసిపో యాయి. ఇందులో రెడ్డిపల్లి రైల్వేస్టేషన్‌ ఒకటి.     
– తల్లెం భరత్‌ కుమార్‌ రెడ్డి, 
    గుంతకల్‌ రైల్వే బోర్డు మెంబర్‌   

సరుకుల రవాణాకు అనుకూలం 
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వేస్టేషన్‌ రెడ్డిపల్లి.దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇక్కడి నుంచి ఇంగ్లాడుకు సరుకుల రవాణ జరిగింది. బ్రిటీషు రైల్వేపాలకులు రెడ్డిపల్లికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు స్టేషన్‌ లేకుండా పోవడం విచారకరం.     
– ముస్తాక్, మండల కనీ్వనర్‌ 

పునరుద్ధరించాలి 
చరిత్ర కల్గిన రైల్వేస్టేషన్‌ రెడ్డిపల్లి జిల్లాలో ఉండడం గర్వకారణం. మా పూర్వీకుల నుంచి స్టేషన్‌ రాకపోకలకు అనుకూలంగా ఉండేది. నేడు దీనిని ఆనవాళ్లు లేకుండా చేయడం బాధాకరం. ఈ స్టేషన్‌ను పునరుద్ధరిస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది.       
– జనార్దన్, రెడ్డిపల్లి, పుల్లంపేట మండలం   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement