లెక్కల గారడీ | - | Sakshi
Sakshi News home page

లెక్కల గారడీ

Published Tue, Feb 18 2025 12:11 AM | Last Updated on Tue, Feb 18 2025 12:10 AM

లెక్కల గారడీ

లెక్కల గారడీ

బి.కొత్తకోట : జిల్లాలోని పేదలకు గూడు భరోసా కల్పిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా 78,221 మందికి పక్కా గృహాలను మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ఇంటిస్థలాలు, నిర్మాణ నిధులు ఇచ్చింది. దీంతో పాటు నిర్మాణాలకు ఇబ్బందులు కలగకుండా బోర్లు, విద్యుత్‌ సౌకర్యం, పుష్కలంగా నీరు లభించేలా చర్యలు తీసుకుంది. రహదారులు ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాల విషయంలో లెక్కలు తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్ని ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయి, వాటికి ఎంత బిల్లు చెల్లించారు ఇలా పూర్తి వివరాలను ఏ రోజుకారోజూ ిసిద్ధం చేయాలి. లేకపోతే పేదల ఇళ్లకు అన్యాయం జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్‌ఎస్‌..బీబీఎల్‌లోకి..

జిల్లాలో జనవరి మొదటి వారం దాకా నిర్మాణాలే చేపట్టని (నాన్‌ స్టార్టెడ్‌) గృహాలు 8,725 ఉన్నట్టు గృహనిర్మాణశాఖ లెక్క. అంటే ఈ ఇళ్ల పనులను లబ్ధిదారులు ఇంకా మొదలు పెట్టలేదు. అయితే ఈ లెక్కను అధికారులు తారుమారు చేశారని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటివారానికి నాన్‌స్టార్టెడ్‌ ఇళ్ల సంఖ్య 1,046కు తగ్గిపోయింది. అంటే కేవలం నెలన్నరోజుల్లో 7,679 ఇళ్ల నిర్మాణాలను పునాదుల స్థాయి నుంచి మొదలు పెట్టారన్నది లెక్క. ఈ విషయంలో రాష్ట్ర అధికారిక లెక్క ప్రకారం నెలక్రితం నివేదికలు పరిశీలిస్తే..అందులోనూ నాన్‌ స్టార్టెడ్‌ ఇళ్ల సంఖ్య లేదు. ప్రారంభంకాని అన్ని ఇళ్లను బీబీఎల్‌ స్థాయిలో ఉన్నట్టు..ఆ ఇళ్లసంఖ్య 9,754గా పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటివారం నివేదికలో బీబీఎల్‌ ఇళ్లు 9,385గా ఉంది. అంటే నాన్‌ స్టార్టెడ్‌ ఇళ్లు దాదాపుగా ప్రారంభమైనట్టుగా లెక్క వేశారు. ఇది అధికారుల లెక్కకు బాగానే ఉంటుంది.. కానీ లబ్ధిదారుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

గడువు దాటాక కష్టాలే

ఈ మార్చిలోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకుంటే కేంద్రం నుంచి నిధులు రావని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని కారణంగానే అధికారులు అన్నీ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాని నివేదిస్తున్నట్టు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్‌లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మించుకునేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఇంటి నిర్మాణం మొదలైనట్టు ఆన్‌లైన్‌లో స్థాయి నమోదు కావడంతో కొత్తగా మళ్లీ ఇంటికి అర్హత కోల్పోవాల్సిందే. ప్రారంభంకాని జాబితాలో ఉంటే ఇంకోసారైనా ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం దక్కుతుంది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నట్టు చూపితే భవిష్యత్‌లో ఇంటికి మంజూరు లభించదు. అలాగే కొత్తగా మంజూరు అవకాశం ఉండదు. దీంతో పేదలు రెండు విధాలా నష్టపోవాల్సి వస్తుంది.మార్చి నెలాఖరులోపు నిర్మాణం పూర్తి చేసుకుంటే నిధులు అందే అవకాశం ఉంటుంది. అలా నిర్మించుకోలేని పేదల పరిస్థితి దయనీయమే. ఇప్పటికే వివిధ కారణాలతో ఇళ్లు నిర్మించుకోలేని వారిలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

పట్టణాలకే కొత్త ఇళ్లు

జిల్లాలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం కేవలం 1,005 పక్కా గృహాలను మాత్రమే మంజూరు చేసింది. లబ్ధిదారుల ఎంపిక మొత్తంగా రహస్యంగానే సాగింది. దీని మంజూరు కోసం నివేదికలను పంపుతున్నారు. ఇందులో లబ్ధిదారులెవరో, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తెలియని పరిస్థితి నెలకొంది. బి.కొత్తకోట నగర పంచాయతీకి మొక్కుబడిగా 75, మదనపల్లె మున్సిపాలిటీకి 460, రాయచోటి మున్సిపాలిటీకి 310, రాజంపేట మున్సిపాలిటీకి 160 గృహాలు కలుపుకుని మొత్తం 1,005 ఇళ్లు కేటాయించారు. మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు కేటాయించాలంటే ఏమూలకు సరిపోవు. ఒక్కో మున్సిపాలిటీలో వేలసంఖ్యలో పేదలు ఉన్నారు. అందరికీ ఇళ్లు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో తమకు కావాల్సిన వారి కోసమే ఇళ్లు కేటాయించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక జిల్లాలోని 30 మండలాల పేదలకు ఇళ్ల మంజూరు ఎప్పుడు చేపడతారని ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై జిల్లా గృహనిర్మాణశాఖ అధికారి శివయ్య మాట్లాడుతూ తొలి విడతలో పట్టణాల్లోని పేదలకు మంజూరు చేశారని చెప్పారు. రెండో విడతలో ఇంకా ఇళ్ల సంఖ్య పెంచడంతోపాటు జిల్లా మొత్తానికి ఇళ్లు మంజూరు చేస్తారని చెప్పారు.

ఇళ్లన్నీ ప్రారంభమయ్యాయట!

నాన్‌స్టార్టెడ్‌ గృహాలు నిర్మాణాల్లో ఉన్నాయట

స్థాయి లెక్క మార్చేసి

లక్ష్యం కోసం తంటాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement