బాధ్యతగా ప్రజా సమస్యలను పరిష్కరించాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సమస్యను ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందన్నారు. కావున అధికారులందరూ ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్‌ఓ మధుసూదనరావు, ఎస్‌డీసీ రమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కాటమరాజు మాన్యం భూమిని ఇప్పించండి
గ్రామస్తులంతా కలిసి సంక్రాంతి పండుగ రోజున ఉత్సాహంగా జరుపుకునే కాటమరాజు గుడి స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా చూడాలని గాలివీడు గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. సోమవారం గాలివీడు మండలం నూలివీడు గ్రామానికి చెందిన వంద మంది ప్రజలు ప్రత్యేక బస్సు, ఇతర వాహనాల ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదును అందజేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 1880, 1887లలో ఉన్న భూమిలో పూర్వీకుల నుంచి కాటమరాజు గుడి కట్టుకొని, అక్కడే ఏటా సంక్రాంతి పండుగ రోజున చిట్లాకుప్ప వేసుకొని పశువులను ఊరేగింపు నిర్వహించేవారమన్నారు. అయితే స్థానికంగా ఉన్న కొందరు ఆ స్థలాన్ని డీకేటీ పట్టాగా మార్చుకుని కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఇదే విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కలెక్టర్ ఫోన్ ద్వారా గాలివీడు తహసీల్దార్‌తో మాట్లాడి దేవుని మాన్యానికి సంబంధించిన భూమిలో ఉన్న పట్టాలను రద్దు చేసి ప్రజలకు అప్పగించాలని సూచించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేశారు. కలెక్టర్ ఆదేశాలను మండల తహసీల్దార్ పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు అక్కడ పంటలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ స్పందించి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తానని మరోమారు హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. అంతకు ముందు గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గుడికి సంబంధించిన ఆస్తిని ఆక్రమణకు గురికాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment