రాయచోటి: పేకాట స్థావరంగా మారిన అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలో ఎస్పీ స్పెషల్ పార్టీ పోలీసులు నిర్వహించిన మెరుపు దాడులలో 14 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. రాయచోటి రూరల్ మండలం గుంటిమడుగు సమీపంలోని కె.నాగార్జునరెడ్డి మామిడి తోటలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ స్పెషల్ పార్టీ పోలీసులతో స్థావరంపై దాడి చేయించారు. వైఎస్సార్, అనంతపురం జిల్లాలకు చెందిన 14 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ దారుల్లో పోలీసులకు దొరకకుండా కొందరు పరుగులు తీసినట్లు సమాచారం. పట్టుబడిన వారి నుంచి రూ.2,69,360 నగదు, 15 సెల్‌ఫోన్లు, మూడు కార్లు, ఒక బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి బుధవారం జూదరులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. కాగా పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసిన సమయంలో పేకాట ఆడుతున్న మరికొందరు పరారయ్యారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వారిని కూడా త్వరలోనే అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
విచ్చలవిడిగా పేకాట
రాయచోటి కేంద్రంగా పేకాట మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. జిల్లా కేంద్రంలో గంజాయి, ఇతర మత్తు పానీయాల విక్రయాలు జోరుగా సాగుతున్నా పోలీసులు మాత్రం వారిచ్చే మామూళ్ల మత్తులో ఉన్నారనే విమర్శలున్నాయి. రాయచోటి పోలీసుల నిర్లక్ష్యం జిల్లా ఎస్పీ కార్యాలయానికి సవాల్‌గా మారింది. ఆడుతున్న సమాచారం స్టేషన్‌కు అందినా ఎలాంటి దాడులు చేయకపోగా, వారి పేర్లను బయటపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. బెల్ట్ షాపులు ఏర్పాటు విషయంలోనూ ఎకై ్సజ్ పోలీసుల కంటే సివిల్ పోలీసుల జోక్యం అధికంగా ఉందన్న సమాచారం దావానంలా వ్యాపిస్తుంది. రాయచోటి రూరల్ మండలం మాధవరం పంచాయతీలో రెండు బెల్ట్ షాపులు నిర్వహిస్తుండగా ఒక బెల్ట్ షాపుపై ఎస్‌ఐ తన సిబ్బందితో వెళ్లి వారం రోజుల కిందట దాడి చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదే గ్రామంలో మరో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నా అతనిపై ఎలాంటి చర్యలు లేవని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం కూడా పేకాట స్థావరంపై దాడి విషయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వకుండా వెళ్లడంతోనే పేకాట ఆడుతున్న వారు పట్టు పడ్డారని కొంత మంది పోలీసుల నోటీ నుంచి వినిపిస్తున్న మాటలు పట్టణంలో హల్ చల్ చేస్తున్నాయి.
13 మంది జూదరుల అరెస్ట్
రూ.2.69 లక్షల నగదు,
3 కార్లు, 15 సెల్‌ఫోన్లు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment