విధుల నుంచి తొలగించారు... ఆత్మహత్యే శరణ్యం
ముఖ్యమంత్రికి విద్యుత్ శాఖ ఉద్యోగి
బహిరంగ లేఖ
ఓబులవారిపల్లె : రాజకీయ ఒత్తిడితో ఉన్న ఫలంగా ఉద్యోగం నుంచి తొలగించారని, తనకు ఆత్మహత్యే శరణ్యమని పసుపులేటి గంగాధర్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు. కలత చెందిన అతడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రులు, అధికారులకు బహిరంగ లేఖ పంపారు. బాధితుడి వివరాల మేరకు.. మండలంలోని గొబ్బూరివారిపల్లి 33/11 కెవీ విద్యుత్తు సబ్ స్టేషన్‌లో రాజంపేట మండలం, శేషమాంభపురం గ్రామానికి చెందిన పసుపులేటి గంగాధర్ సాయి పనిచేస్తున్నాడు.
2024 మార్చి నెలలో తాను డ్యూటీలో చేరారు. ఏడాది కాలంగా జీతం ఇవ్వకపోయినా రోజూ విధులకు హాజరువుతూ లాగ్ పుస్తకంలో సంతకాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అభిషేక్ అనే వ్యక్తి సబ్ స్టేషన్‌లోని లాగ్ పుస్తకంలో సంతకాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ నెల 17వ తేదీన యథావిధిగా డ్యూటీకి వెళ్లగా తనను షిప్ట్ ఆపరేటర్‌గా తొలగించినట్లు ఏఈ తెలిపారన్నారు. ఎందుకు తొలగించారని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. తనకు 12 నెలలు జీతం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే తనకు ఆత్మహత్యే శరణమని, అధికారులు లేఖనే మరణ వాంగ్మూలంగా పరిగణించాలని రాశాడు. రైల్వేకోడూరు ఏడీ ఈ భాస్కర్ రావును వివరణ కోరగా ఆపరేటర్లు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు తీసుకోవడం, తొలగించడం జరుగుతుందని, తమకు సంబంధం లేదని వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment