●మదనపల్లె మెడికల్‌ కళాశాలపై నీలినీడలు | - | Sakshi
Sakshi News home page

●మదనపల్లె మెడికల్‌ కళాశాలపై నీలినీడలు

Published Wed, Mar 12 2025 8:12 AM | Last Updated on Wed, Mar 12 2025 8:08 AM

●మదనప

●మదనపల్లె మెడికల్‌ కళాశాలపై నీలినీడలు

నేడు రాయచోటిలో యువత పోరు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. కూటమి సర్కారు పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకపోవడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోకపోవడం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, ప్రతి ఏడాది జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకపోవడం, మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు రాయచోటిలోని జాతీయ రహదారి నుంచి కలెక్టర్‌ చాంబర్‌ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. కార్యక్రమం విజయవంతానికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పోస్టర్లను ఆవిష్కరించారు. యువత పోరుకు పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యో గులు తరలిరావాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల అనంతరం అఽధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసింది. అధికారంలోకి రాకమునుపు ఒకటేమిటి? అది చేస్తాం, ఇది చేస్తామంటూ బురిడీ కొట్టించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు.. అదీ లేకపోతే నిరుద్యోగ భృతి, చదువుకునే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఇలా ఎన్నో చెప్పి చివరకు సూపర్‌ సిక్స్‌ లేకపోగా, మిగతావి కూడా అమలు చేయకుండా మాయమాటలతో ముందుకు సాగుతోంది. ఇప్పుడే కాదు.. 2014లో కూడా హామీలిచ్చి అధికారంలోకి రాగానే ఎగనామం పెట్టింది. అయితే 2019 వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు పరిశ్రమలు, మరోవైపు నిరుద్యోగులకు ఉపాధి, ఇంకోవైపు చదువులకు వైఎస్సార్‌ విద్యాదీవెన ఎప్పటికప్పుడు త్రైమాసికంలోనే అందిస్తూ అన్ని విధాలా ఆదుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరి ఆరోగ్యానికి భరోసా నింపుతూ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడం ఒక ఎత్తయితే, మెడికల్‌ కళాశాలలు నిర్మించి వైద్య విద్యకు పెద్దపీట వేశారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ముందడుగు పడని పరిస్థితుల్లో.. వైఎస్సార్‌ సీపీ పోరుబాటకు సంకల్పించింది.

చదువుకేదీ భరోసా

వైఎస్సార్‌సీపీ హయాంలో చదువులకు భరోసా ఉండేది. ఇంజినీరు కావాలన్నా.. డాక్టర్‌ కోర్సు చేయాలన్నా.. ఇతర పెద్ద చదువులకు చదవాలన్నా ప్రోత్సాహం అందించింది. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్‌ విద్యా దీవెన కింద 1,50,934 మందికి సుమారు రూ.378.75 కోట్లు అందించారు. వైఎస్సార్‌ వసతి దీవెన కింద రూ. 1,28,290 మందికి రూ.150.33 కోట్ల సొమ్మును అందించారు. పేద విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ సర్కారు అండగా నిలుస్తూ వచ్చింది.

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు

అన్నమయ్య జిల్లాలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ప్రైవేటు కొలువులు దొరకక అవస్థలు తప్పడం లేదు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్‌, బీఈడీ తదితర కోర్సులు చేసిన వారు నిరుద్యోగులుగా మారుతున్నారు. అధికారంలోకి రాకమునుపు కూటమి నేతలు ప్రతి ఒక్కరికీ ఉద్యోగం లేకపోతే.. నిరుద్యోగ భృతి రూ.3 వేలు అందిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు చూస్తే తొమ్మిది నెలలు అవుతున్నా అతీగతీ లేని పరిస్థితి కనిపిస్తోంది. కొత్త పరిశ్రమల జాడ జిల్లాలో లేకపోగా, నిరుద్యోగులకు ఉద్యోగాలకల్పన మాటలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. జిల్లాలో సుమారు 2,45,000కు పైగా యువత, నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఏడాది జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు ఇంతకుముందు ప్రకటించినా ఇప్పటికీ ఆ ఊసే ఎత్తలేదు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇదిగో, అదిగో అంటున్నారే తప్ప అడుగులు ముందుకు పడని పరిస్థితిపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

యువతను నిట్టనిలువునాముంచిన కూటమి

నిరుద్యోగులకు భృతి లేదు.. ఉపాధి కానరాదు

ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించని ప్రభుత్వం

ఐదు త్రైమాసికాలకు రూ.212 కోట్లకు పైగా బకాయిలు

మదనపల్లె మెడికల్‌ కళాశాలకు మంగళం

నేడు కలెక్టరేట్‌ ఎదుటవైఎస్సార్‌సీపీ ‘యువత పోరు’

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యతనిస్తూ.. వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెకు మెడికల్‌ కళాశాలలు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టింది. గతేడాది జూన్‌ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని, అందుకు తగ్గట్టు భవనాలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కళాశాలకు 150 సీట్లు వస్తాయని అంచనా వేసిన తరుణంలో.. కూటమి అధికారంలోకి రాగానే వైద్య కళాశాలలపై నీలినీడలు కమ్ముకున్నాయి. పులివెందుల, మదనపల్లెలో సిబ్బందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నా.. కూటమి ప్రభుత్వం కళాశాలలను ప్రైవేటుకు అప్పగించే ఆలోచన నేపథ్యంలో ఉన్న వారందరినీ ఇతర ప్రాంతాలకు పంపించేసింది. ఒకపక్క మెడికల్‌ కళాశాలకు సంంధించిన సీట్లను కోల్పోగా.. మరోపక్క మదనపల్లె మెడికల్‌ కళాశాల నిర్మాణంపై సందేహాలు నెలకొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
●మదనపల్లె మెడికల్‌ కళాశాలపై నీలినీడలు 1
1/2

●మదనపల్లె మెడికల్‌ కళాశాలపై నీలినీడలు

●మదనపల్లె మెడికల్‌ కళాశాలపై నీలినీడలు 2
2/2

●మదనపల్లె మెడికల్‌ కళాశాలపై నీలినీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement