యథేచ్ఛగా ఇసుక దోపిడీ
● ప్రభుత్వ నిర్దేశిత ధరల కంటే అదనంగా వసూళ్లు
● టిప్పర్ అసోసియేషన్ పేరుతో కృత్తిమ కొరత
● ఇతర టిప్పర్లు పట్టణంలోకి రాకుండా అడ్డగింత
● చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు
మదనపల్లె: పట్టణంలో ఇసుక దోపిడీ యథేచ్చగా కొనసాగుతోంది. ఉచిత ఇసుక విధానంతో సామాన్యుడికి ఇసుక అందుబాటులోకి తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమిప్రభుత్వం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీని మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తోంది. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే టిప్పర్ యజమానులు వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి, తాము చెప్పిందే ధర, తాము తోలిందే ఇసుక అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భవన నిర్మాణ యజమానులు ఎవరైనా నేరుగా రీచ్ నుంచి ఇసుక తోలుకునేందుకు ప్రయత్నిస్తే, వాహనాలను అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నేషనల్ హైవేపై అసోసియేషన్ కార్యాలయం ఎదుట 15కు పైగా టిప్పర్లను నిలుపుకుని బహిరంగంగా విక్రయాలు జరుపుతున్నారు. ఇసుక అక్రమరవాణా, బ్లాక్ మార్కెటింగ్ నివారణకు ఏర్పాటుచేసిన విజిలెన్స్ విభాగం, గనులశాఖ, రెవెన్యూ అధికారుల కళ్లెదుటే ఇదంతా జరుగుతున్నప్పటికీ పట్టించుకున్న దాఖలా లేదు.
● ప్రభుత్వ పోర్టల్‌లో కానీ లేదా స్థానిక గ్రామ,వార్డు సచివాలయాల్లో వెళ్లి భవన నిర్మాణ అనుమతులు చూపించి ఇసుకను పొందే వీలును ప్రభుత్వం కల్పించింది. ఇందుకు వినియోగదారుడు ఇసుక లోడింగ్ చేసేందుకు, రీచ్ నుంచి ఇంటి వరకు రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో రవాణా చార్జీలను ఖరారుచేసి, సరఫరాలో ఎలాంటి అవినీతి జరగకుండా విజిలెన్స్ మానిటరింగ్, మైనింగ్ చెక్‌పోస్ట్‌లు, పోలీస్ తనిఖీలు చేయాలని ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. అన్నమయ్యజిల్లా రాజంపేట మండలం బాలరాజుపల్లె వద్ద ఇసుకరీచ్ ఉంది. మదనపల్లె నుంచి ఇసుకరీచ్‌కు 132 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పట్టణంలో భవన నిర్మాణపనులు అధికంగా జరుగుతుండటం, డిమాండ్ ఉండటంతో కొద్దిరోజుల క్రితం వరకు రాయచోటి, పీలేరు, వాల్మీకిపురం, మదనపల్లెకు చెందిన టిప్పర్ యజమానులు రూ.18వేలకు టిప్పర్ ఇసుక తోలేవారు. ప్రజల నుంచి ఈ ధరలపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే..ఈనెల 2న బైపాస్‌రోడ్డులో మదనపల్లె టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి, సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టి... టీడీపీ తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుతో ప్రారంభించారు. అధికారపార్టీ అండతో ఇసుక రవాణాను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, అధికారికంగా బిల్లులు ఉన్న ఇతర ప్రాంతాల ఇసుక టిప్పర్లను పట్టణంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం మొదలుపెట్టారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి, ఎవరికై నా ఇసుక కావాల్సి వస్తే తమనే సంప్రదించాలని, టిప్పర్ ఇసుకకు 22 నుంచి 24 వేల ధర నిర్ణయించి, తమవద్దే కొనుగోలుచేయాల్సిందిగా హుకుం జారీచేశారు. దీంతో ఇసుక అవసరమైన వారు వారు చెప్పిన ధరలు చెల్లించి, కిమ్మనకుండా తోలుకుంటున్నారు.
వాస్తవానికి ఇసుక రీచ్ నుంచి బయలుదేరిన టిప్పర్ నేరుగా వినియోగదారుడికి డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే..తప్పుడు బిల్లులతో తీసుకువచ్చిన సుమారు 15 లారీలకు పైగా ఇసుక నింపుకున్న టిప్పర్‌లు అసోసియేషన్ కార్యాలయం ఎదుట నేషనల్ హైవేపై నిలుపుకుని బహిరంగ విక్రయాలు చేస్తున్నారు. ఈ విషయమై టిప్పర్ అసోసియేషన్ నాయకులను వివరణ కోరితే...టిప్పర్ యజమానులు నష్టపోకూడదనే తాము అసోసియేషన్ ఏర్పాటుచేసుకున్నామని, ప్రభుత్వం 18,400 ధర నిర్ణయించిందని, తాము 3వేలు మాత్రమే అదనంగా వసూలుచేస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాల టిప్పర్‌లు వస్తే అసోసియేషన్ మెయింటెన్స్‌కు డబ్బులు కట్టించుకుని వదులుతున్నామన్నారు.
దోపిడీని అరికట్టాలి...
ఇసుక రవాణాకు సంబంధించి ప్రధాన రహదారుల్లో మైనింగ్, విజిలెన్స్, పోలీసు అధికారుల తనిఖీలు, చెక్‌పోస్ట్ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోంది. తక్కువ ధరకు ఇసుక తోలేందుకు వస్తున్న టిప్పర్ యజమానులను, టిప్పర్ అసోసియేషన్ సభ్యులు బెదిరించడం తగదు. పోలీస్, మైనింగ్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, ఇసుక మాఫియాపై కఠినచర్యలు తీసుకోవాలి. – సాంబశివ,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment