సూరప్పగారిపల్లెలో భారీ చోరీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ సూరప్పగారిపల్లెలో భారీ చోరి జరిగింది. వ్యవసాయపనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన ఓ రైతు ఇంట్లో దుండగులు ప్రవేశించి 150 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేలు నగదు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన కుమ్మర మునిస్వామి వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటికి తాళాలు వేసుకొని గ్రామానికి సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లారు. రైతు దంపతులు సాయంకాలం వరకు వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నట్లు గుర్తించి పరుగున ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లోని ఓ గదిలో ఉన్న బీరువాను అప్పటికే బద్దలు కొట్టి అందులో వస్తువులు చిందర వందరగా పడేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొన్నారు. మొత్తం పరిశీలించగా బీరువాలో దాచి ఉంచిన రూ. 13లక్షలు విలువచేసే బంగారు నగలు, రూ.50 వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆరుగాలం కష్టపడి పనిచేసి దాచి ఉంచుకొన్న నగలు, సొమ్ము చోరికి గురికావడంతో రైతు దంపతులు బోరున విలపించారు. జరిగిన సంఘటనపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సూరప్పగారిపల్లెలో భారీ చోరీ
Comments
Please login to add a commentAdd a comment