ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 నుంచి 15 వరకు జరగనున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైఎస్‌ఆర్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు, సీఐలకు పలు సూచనలు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. కడప–ఒంటిమిట్ట మార్గంలోని ఉప్పరపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశం, కల్యాణ వేదిక, సాలాబాద్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రవేశం, టీటీడీ గెస్ట్ హౌస్, వీవీఐపీ గెస్ట్ హౌస్, ఆలయ పరిసరాలు పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై కడప డీఎస్పీ వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కల్యాణ వేదిక సమీపంలోని పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు క్రమ పద్ధతిలో నిలిపి ఉంచేలా పర్యవేక్షించాలన్నారు. భారీ కేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment