విద్యార్థీ.. విజయోస్తు
సాక్షి రాయచోటి/రాజంపేట టౌన్: ఏడాది కాలంగా కష్టపడి చదివిన విద్యార్థులు.. ఇక పేపరుపై రాయడానికి సమయం ఆసన్నమైంది. పది పరీక్షలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. విద్యార్థులందరికీ విజయీభవ. పట్టుదలతో చదివిన అంశాలను.. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా.. పేపరుపై విశదీకరిస్తే సులువుగా ఉత్తమ ఫలితం సాధిస్తారని విద్యావేత్తలు అభివర్ణిస్తున్నారు. ‘పది’ పరీక్షలు అనగానే ఏదో లోలోపల టెన్షన్ పడకుండా.. ప్రశాంతమైన మనసుతో రాయడమే విజయానికి నాందిగా మేధావులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, గురువుల ఆశయాలు, ఆకాంక్షలకు అనగుణంగా రాణించేందుకు.. ప్రతి విద్యార్థి ప్రయత్నం చేయాలని ‘సాక్షి’ ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే పదవ తరగతికి సంబంధించి సీబీఎస్‌ఈ పరీక్షలు ఈ నెల 12వ తేదీతో ముగిశాయి. స్టేట్ సిలబస్‌కు సంబంధించి సోమవారం (17వ తేది) నుంచి ప్రారంభమై ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30కి పరీక్ష ముగియనుంది.
1250 ఇన్విజలేటర్లు నియామకం
పరీక్షా కేంద్రాలను అఽధికారులు నో సెల్‌ఫోన్ జోన్‌గా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరు కూడా సెల్‌ఫోన్‌ను పరీక్షా కేంద్రంలోకి తీసుకు వెళ్లకూడదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 1250 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. అంతేకాకుండా పరీక్షల్లో మాస్ కాపీయింగ్, బయట నుంచి కాపీయింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కాపీయింగ్‌ను అరికట్టేందుకు ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు 25 సిట్టింగ్ స్క్వాడ్‌లను వినియోగిస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా.. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను పరీక్షల సమయంలో మూతవేసేలా ఆదేశాలు ఇచ్చారు.
కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షణ
జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తింపు పొందిన పలు సెంటర్లలో పరీక్షలు నిఘా నీడలో కొనసాగనున్నాయి. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ఈసారి పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు సంబంధించి ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అమర్చి కంట్రోల్ రూము ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ముక్కావారిపల్లెలో రెండు కేంద్రాలు, కలికిరి బాలికల ఉన్నత పాఠశాల, గాలివీడు ఉర్దూ ఉన్నత పాఠశాలతోపాటు చక్రంపేట, పాటూరు, చిన్నతిప్పసముద్రం, చింతపర్తి కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్నాయి.
ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా..
ఓపెన్ టెన్త్ పరీక్షలు కూడా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు జరగనున్నాయి. ఇందుకోసం 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 834 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.
సర్వం సిద్ధం
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వం సిద్ధం చేశాం. ఏ చిన్న తప్పిదం జరిగిగా అందుకు ఆయా పరీక్షా కేంద్రాల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్యార్థులను 8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ఏ పరీక్షా కేంద్రంలో అయినా వసతులు సరిగా లేకున్నా, సమస్యలు ఉన్నా విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ 9100040686 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. – సుబ్రమణ్యం, డీఈఓ
శుభాశీస్సులు
అన్నమయ్య జిల్లాలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాభినందనాలు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ప్రశాంత మనసుతో పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలి. ‘కలలు కనాలి.. సాకారం చేసుకోవాలి’ అని చెప్పిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం, అకుంఠిత పట్టుదలతో పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలతో జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకు రావాలి. పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి ఆల్ ది బెస్ట్! – ఛామకూరి శ్రీధర్, కలెక్టర్
అసౌకర్యాల నీడలో..
జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అనేక పాఠశాలల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రధానంగా వెలుతురు సరిగా లేకపోవడం, ఇరుకు గదులు, బెంచీలు అంతంత మాత్రంగా ఉండటం లాంటివి కనిపిస్తున్నాయి. ఇవేకాకుండా అనేక అసౌకర్యాలు విద్యార్థులకు పరీక్షలు పెడుతున్నాయి. చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులను ఎలా అధిగమించి ముందుకు వెళతారనేది వేచి చూడాల్సిందే.
22,355 మంది విద్యార్థులు హాజరు
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 22,355 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లాలో 502 ఉన్నత పాఠశాలలు ఉండగా, అందులో రెగ్యులర్ విద్యార్థులు 22,355 మంది పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యారు. 121 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి 3855 మంది పరీక్షలు రాయనున్నారు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా 121 కేంద్రాలు
సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా
25 సిట్టింగ్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్
ఉదయం 9.30 నుంచి 12.30 వరకు నిర్వహణ
విద్యార్థీ.. విజయోస్తు
విద్యార్థీ.. విజయోస్తు
Comments
Please login to add a commentAdd a comment