బంధువుల గృహప్రవేశానికి వెళుతూ..
మదనపల్లె : బంధువుల ఇంట గృహప్రవేశ వేడుకకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంలో వెళుతూ, మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పి ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. మదనపల్లె పట్టణం భవానీనగర్‌కు చెందిన వెంకటరమణ(55), చీకలబైలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలకు సంబంధించి రామసముద్రం మండలానికి చీఫ్ సూపర్‌వైజర్‌గా నియమితులయ్యారు. ఆదివారం మధ్యాహ్నం రామసముద్రంలో పదోతరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించాల్సి ఉంది. ఈలోపు పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెలో బంధువుల ఇంట గృహప్రవేశానికి వెళ్లాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో...అక్కడకు వెళ్లి అటునుంచే రామసముద్రం వెళ్లేందుకు నిర్ణయించుకుని ఇంటి నుంచి బయలుదేరారు. చౌడేపల్లెకు వెళుతుండగా, మార్గమధ్యంలోని కృష్ణాపురం వద్ద రోడ్డుపై ఉన్న స్పీడ్‌బ్రేకర్‌ను గమనించిక బైక్‌ను వేగంగా నడపటంతో, వాహనం గాల్లోకి ఎగిరింది. దీంతో బైక్ బోల్తాపడటంతో వెంకటరమణ తీవ్రంగా గాయపడటంతో పాటు తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంకటరమణ మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య సుశీల, కూతురు చరిత, కుమారుడు కృష్ణకాంత్ ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని వెంకటరమణ మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బైక్ అదుపుతప్పి ఉపాధ్యాయుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment