ఆలయం ముసుగులో ఆక్రమణకు యత్నం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని నడివీధి గంగమ్మ ఆలయం వద్ద పురాతనమైన బ్రిటీష్ కాలం నాటి గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని (ప్రభుత్వ గ్రామ రెవెన్యూ చావిడి) టీడీపీ నాయకులు కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే.. 1500–బి1 సర్వే నెంబరులో లక్షలు విలువ జేసే రెవెన్యూ చావిడితో కలిసి తొమ్మిది సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని కొన్ని నెలల నుంచి ఒంటిమిట్టలోని టీడీపీ నాయకులు నడివీధి గంగమ్మ ఆలయం ముసుగులో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ రెవెన్యూ చావిడిని కూల్చి నడివీధి గంగమ్మకు ఇవ్వమని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు కూడా అందజేశారు. కానీ కలెక్టర్ వద్ద నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. అయినా తమ ప్రభుత్వం అధికారంలో ఉందనే కారణంగా ఎలాంటి అనుమతులు లేకపోయినా ఆదివారం అక్రమంగా కూల్చివేతకు పాల్పడ్డారు. ఒంటిమిట్ట గ్రామ రెవెన్యూ సిబ్బంది అడ్డుకోగా వారిని లెక్కచేయకుండా వారిపట్ల అనుచితంగా ప్రవర్తించి కూల్చి వేశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూల్చివేత పనులను మధ్యలో నిలుపుదల చేయించారు. కూల్చివేతకు పాల్పడిన ఉగ్గురారపు వెంకటరమణ, అంగదాల వెంకటసుబ్బయ్య, పత్తి కృష్ణయ్య, గుర్తుకొండ శ్రీను, పసుపులేటి కృష్ణయ్యలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే గ్రామ రెవెన్యూ కార్యాలయం కూల్చివేతలో ప్రధాన పాత్ర పోషించిన మాడా వీధికి చెందిన ఓ యువకుడి పేరు తొలుత ఫిర్యాదులో పేర్కొని తరువాత తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ గ్రామ రెవెన్యూ కార్యాలయాన్ని కూల్చివేసిన టీడీపీ నాయకులు
కూల్చివేతను అడ్డుకోబోయిన రెవెన్యూ సిబ్బందిపై అనుచిత ప్రవర్తన
నడివీధి గంగమ్మ ఆలయం ముసుగులో లక్షలు విలువచేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు కుట్ర
ఆలయం ముసుగులో ఆక్రమణకు యత్నం
Comments
Please login to add a commentAdd a comment