నేడు జిల్లాకు ప్రత్యేకాధికారి వినయ్ చంద్
రాయచోటి: ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి వాడరేవు వినయ్ చంద్ శనివారం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం రాయచోటిలోని డైట్ ఉన్నత పాఠశాల, మున్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, కాటిమాయకుంట తదితర ప్రాంతాల్లో జరగనున్న స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శిగా కరీముల్లా
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎస్‌ఏ కరీముల్లాను రాష్ట్ర మైనార్టీ విభాగ కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన కార్యవర్గం
కడప సెవెన్‌రోడ్స్: ఏపీ శారీరక వికలాంగుల ఉద్యోగ సంక్షేమ సంఘానికి కొత్త కార్యవర్గ ఎన్నిక శుక్రవారం కడప నగరంలోని విద్యుత్ విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా బి.సుధాకర్, అధ్యక్షుడిగా పులిమి జేమ్స్, ప్రధాన కార్యదర్శిగా చిన్నకొట్టి చంద్ర, ట్రెజరర్‌గా బత్తుల చంద్రశేఖర్, సమాచార కార్యదర్శిగా పి.సుబ్బరాజు, కార్యదర్శులుగా వై.గుర్రప్ప, హెచ్.నరసింహులు, కన్వీనర్‌గా ఎం.రవిశంకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
21న మెగా జాబ్‌మేళా
రాయచోటి జగదాంబసెంటర్: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ), సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ఉద్యోగమేళాలో టెక్‌మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండిగో ఎయిర్‌లైన్స్, అడక్కో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆధ్య హెచ్‌ఆర్ సొల్యూషన్స్, నియో లింక్, ముత్తూట్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్, బిగ్ సీ, ఫోన్ పే ఫ్లిప్‌కార్ట్, అపోలో ఫార్మసీ తదితర కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9550104260, 9618971075 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ వివరించారు.
మహిళల భద్రతకు ‘శక్తి యాప్’
రాయచోటి: మహిళలు, బాలికల భద్రత కోసం శక్తియాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో యాప్ వినియోగం గురించి ఎస్పీ వివరించారు. జిల్లాలో ప్రతి మహిళ, గృహిణులు, విద్యార్థినులు, బాలికలు వారి మొబైల్‌లో శక్తియాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఆపద సమయంలో పోలీసుల నుంచి తక్షణ సహాయ సహకారాలు పొందాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా ఏస్‌ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే వారు ఉన్న ప్రాంతం వివరాలు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు డయల్ 112 నంబర్‌కు చేరుతుందని, వెంటనే పోలీసులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకొని వారికి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపడతారని ఎస్పీ వివరించారు.
శాస్త్రోక్తంగా చక్రస్నానం
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజైన శుక్రవారం ఉదయం తోమాలసేవ, తిరుచ్చి ఉత్సవం, ఊంజల్‌సేవలు జరిగాయి.అర్చకులు రంగునీళ్లు, పుసుపునీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకొంటూ కోలాహాలంగా వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిపించారు. స్వామివారి ఆయుధాలైన శంఖు,చక్రాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తూ చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన తిరుచ్చి వాహనంలో స్వామివారిని కొలువుదీర్చి గ్రామపురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అర్చకులు ధ్వజావరోహణ కార్యక్రమం జరిపారు. ఏకాంత సేవతో ఈరోజు ఉత్సవాలు ముగిశాయి. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహించారుకార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment