
దెబ్బతిన్న అరటి పంట పరిశీలన
సిద్దవటం: మండలం లోని మాచుపల్లె గ్రామంలో శుక్రవారం సాయంత్రం వీచిన గాలులకు దెబ్బతిన్న అరటి పంటను శనివారం ఉద్యాన శాఖ అధికారి జయభరత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచుపల్లె గ్రామానికి చెందిన రైతు పైనేని సుబ్బరాయుడు 3 ఎకరాల్లో అరటి పంటను సాగుచేశారన్నారు. గాలులకు తోట దెబతిందని తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఉపాధ్యాయులకు వైద్య శిబిరం
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో ఉపాధ్యాయులకు ఈ నెల 24 నుంచి 26 వరకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లాలోని గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల పాఠశాలల అన్ని క్యాటగిరీల ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వైద్య ధ్రువీకరణ పత్రాలు అనగా ప్రిఫరెన్సియల్ క్యాటగిరి స్పెషల్ పాయింట్లకు అర్హత కలిగిన వారు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. హాస్పిటల్ వారు ఇచ్చిన సర్టిఫికెట్ మేరకు ప్రిఫరెన్సియల్, స్పెషల్ పాయింట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు రిమ్స్‌లో వైద్య ధ్రువీకరణ పత్రాలు పొందడానికి తాజా మెడికల్ రిపోర్టులు తీసుకుని రావాలని వివరించారు.
బాధ్యతలు స్వీకరణ
కడప కోటిరెడ్డి సర్కిల్: ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయతుల్లా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన నియమితులయ్యారు. శనివారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హిదాయతుల్లా మాట్లాడుతూ మహిళలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు వంటి అన్ని మైనారిటీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న మైనారిటీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన వ్యక్తులకు చేరుస్తామని తెలిపారు. సంబంధీకులు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించాలని వివరించారు.

దెబ్బతిన్న అరటి పంట పరిశీలన