ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
కొడుకులా ఆదుకున్నాడు..
మాది చాలా నిరుపేద కుటుంబం. భార్యాభర్తలం చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లం. విశాఖ జిల్లా భీమునిపటా్ననికి చెందిన మాకు ఇద్దరు పిల్లలు. కొడుకు కూలి పనులు చేసుకుంటూ వేరుగా ఉంటున్నాడు. కూతురికి పెళ్లి చేసి పంపాము. మేమిద్దరం జీవనం సాగించడానికి అనారోగ్య సమస్యలతో పాటు వయసు కూడా మీద పడటంతో చాలా ఇబ్బందులు పడేవాళ్లం. రోజులు గడుస్తున్న కొద్దీ బతుకు భారంగా మారడంతో దిక్కుతోచని స్థితికి వచ్చాము.
అలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంది. మాలాంటి నిరుపేదలకు కొండంత అండగా నిలబడింది. నాకు చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 వంతున ఇప్పటి వరకు మూడు విడతలుగా రూ.56,250 వచ్చింది. ఆసరా కింద కూడా రూ.20 వేలు వచ్చింది. ఈ సొమ్ముతో మేము ఉంటున్న ఇంటి ముందు చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాము.
చుట్టుపక్కల వారు మా వద్దకు వచ్చి టిఫిన్ చేసి వెళతారు. వస్తున్న ఆదాయం మా ఇద్దరికీ చక్కగా సరిపోతోంది. మా ఆయనకు వృద్ధాప్య పింఛన్ కూడా వస్తోంది. ఈ నెల రూ.3 వేలు ఇచ్చారు. ఇప్పుడు మాకు ఎలాంటి ఆందోళన లేదు. హాయిగా ఉన్నాం. మమ్మల్ని పెద్ద కొడుకులా సీఎం జగన్ ఆదుకున్నారు. – బుంగ అన్నపూర్ణ, భీమునిపట్నం (ఎస్.రమణప్రసాద్, విలేకరి, భీమునిపట్నం)
ఆనందంగా పంటల సాగు
మాది సన్నకారు రైతు కుటుంబం. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరులో రెండెకరాల పొలం ఉంది. ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో పసుపు, అరటి వేసేవాళ్లం. వ్యవసాయం చేయాలంటేనే ఒకప్పుడు భయం వేసేది. ఎప్పుడూ పెట్టుబడి కోసం అప్పులు చేయడం.. తీరా పంట చేతికొచ్చాక వాటిని తీర్చడం అలవాటుగా మారింది. భార్య నగలు బ్యాంకులో పెట్టి అప్పు తేవాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తు ప్రకృతి అనుకూలించకపోతే ఆ ఏడాది అప్పు తీర్చలేక నానా అవస్థలు పడేవాళ్లం. కుటుంబ పోషణ కష్టంగా ఉండేది.
పిల్లలను చదివించుకోవటం ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక మాకు వ్యవసాయ పెట్టుబడికి భయం లేకుండా పోయింది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ఇస్తోంది. ఆ డబ్బు సాగు ఖర్చుల కోసం.. ప్రధానంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ఉపయోగ పడుతోంది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వ్యయప్రయాసలు తొలిగాయి. ఉన్న ఊళ్లోనే అన్నీ దొరుకుతున్నాయి. కొద్దిపాటి బంగారు నగలు నా భార్య మెడలోనే ఉంటున్నాయి. ఆమె ఇంటిదగ్గర కుట్టు మిషనుపై బట్టలు కుడుతూ కుటుంబానికి తోడ్పాటుగా నిలుస్తోంది.
ఆమెకు జగనన్న చేదోడు పథకం కింద ఏటా రూ.పది వేలు అందుతున్నాయి. మా పెద్దబ్బాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వాడికి వసతి, విద్యా దీవెన కింద నిధులు జమ అవుతున్నాయి. చిన్నబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. వాడికి అమ్మఒడి కింద ఏటా రూ.15,000 చొప్పున వస్తోంది. వివిధ పథకాల ద్వారా డబ్బులు అందుతుండడంతో అప్పులు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ఏడాది వరి, పసుపు పంట బాగుంది. మంచి ధర కూడా ఉంది. సంతోషంగా జీవిస్తున్నాం.
– కొమ్మారెడ్డి శివప్రసాదరెడ్డి, తూములూరు (బి.ఎల్.నారాయణ, విలేకరి, తెనాలి)
‘పాడి’తో గట్టెక్కాను
పాడి పశువులు పెంచుతూ పాల వ్యాపారం చేయడం మా వృత్తి. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో మహిళా స్వయం శక్తి సంఘంలో సభ్యురాలిని. గతంలో పలు సందర్భాలలో రుణం పొందినా, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుతున్న సాయం మాత్రం చాలా ఉపయోగపడుతోంది. ఆసరా కింద ఇప్పటి వరకు రూ.47 వేలకుపైగా నా ఖాతాలో జమ అయింది.
దీంతోపాటు బ్యాంకు లోనుకు దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 వంతున ఆర్థిక సాయం అందుతోంది. ఈ మొత్తంతో పాడి గేదెల యూనిట్ ఏర్పాటు చేసుకున్నా. అన్ని ఖర్చులుపోనూ నెలకు రూ.10 వేలకు పైగా మిగులుతోంది. దీంతో నా కుటుంబ పోషణ సులువైంది. నా ఇద్దరు పిల్లలకు పెళ్లి చేశాను. వారిని ఆర్థికంగా నిలబెట్టగలిగానంటే అందుకు నా పాడి వ్యాపారమే కారణం. – గుండుమేను శశిరేఖ, గొల్లపాలెం (తోట సత్యనారాయణ, విలేకరి, మలికిపురం)
Comments
Please login to add a commentAdd a comment