పోతుందనుకున్న ప్రాణం నిలబడింది | YS Jagan Mohan Reddy Implemnting Navaratna Schemes In AP | Sakshi
Sakshi News home page

పోతుందనుకున్న ప్రాణం నిలబడింది

Published Thu, Feb 29 2024 8:42 AM | Last Updated on Thu, Feb 29 2024 8:42 AM

YS Jagan Mohan Reddy Implemnting Navaratna Schemes In AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

పోతుందనుకున్న ప్రాణం నిలబడింది 
మాది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సెలూన్‌ షాపు నడుపుకుంటున్నా. నాకు భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో నాలుగేళ్ల కిందట ఉదర సంబంధిత అనారోగ్యంతో మంచం పట్టాను. చికిత్స చేయించుకుందామంటే ఆరి్థక పరిస్థితి అంతంత మాత్రమే. అలాంటి దీన పరిస్థితిలో జగనన్న ప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 2,64,626 విలువైన కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించి ప్రాణం నిలబెట్టింది. 

శస్త్రచికిత్స అనంతరం మందుల ఖర్చులు, రవాణా ఖర్చులకు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా రూ.28,900 నేరుగా నా బ్యాంకు ఖాతాలో జమ చేసింది. సెలూన్‌ షాపు ఉండటంతో జగనన్న చేదోడు కింద ఏటా రూ.10,000 వంతున అందింది. షాపునకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. నా భార్యకు వైఎస్సార్‌ ఆసరా కింద రూ.20,848, పెద్ద కొడుకు పవన్‌సాయికి విద్యా దీవెన కింద రూ.12,000, చిన్న కొడుకు ఆదిత్యసాయికి అమ్మఒడి కింద రూ.30,000 వచ్చాయి. టీడీపీ ప్రభుత్వ పాలనలో మాకు ఎలాంటి లబ్ధి కలగలేదు. నా ప్రాణం నిలబెట్టిన, మా కుటుంబ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. 
– అజ్జాడ సింహాచలం, కురుపాం (కె.చంద్రమౌళి, విలేకరి, కురుపాం) 

సర్కారు సాయంతో హాయిగా జీవనం 
నాకు ఐదుగురు సంతానం. అందరికీ వివాహాలు చేశా. ఎవరి బతుకులు వాళ్లు బతుకున్నారు. నా భర్త చనిపోయి నాలుగేళ్లయింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా బిడ్డలపై ఆధారపడకుండా ధైర్యంగా బతుకుతున్నా. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో జీవిస్తున్నా. ఒంటరిగా బతుకుతున్నానన్న బాధ ఏ రోజూ కలగలేదు. ప్రతినెలా వితంతు పింఛన్‌ అందుకుంటున్నా. ఈ సొమ్ము నా నెలవారీ ఖర్చుకు సరిపోతుంది. 

వైఎస్సార్‌ ఆసరా కింద రూ.30,144 రుణమాఫీ సొమ్ముని నా ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 వంతున అందింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.4,898 జమయ్యింది. చిత్తశుద్ధితో నాలాంటి కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. 
– కాకరపర్తి మంగాయమ్మ, పశివేదల (జి.వి.వి.సత్యనారాయణ,విలేకరి, కొవ్వూరు) 

 ఒంటరి బతుక్కి ప్రభుత్వం అండ
భర్తను కోల్పోయి, పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు జగనన్న ప్రభుత్వం అడుగడుగునా చేదోడుగా నిలిచింది. నా భర్త సుబ్బారావు పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వైఎస్సార్‌ జిల్లా సిద్దవటం గ్రామంలో టైలరింగ్‌ వృత్తి చేసుకుంటూ ఆడ పిల్లలిద్దర్ని పెంచి, పెద్దచేసి పెళ్లి చేశా. కొడుకు పృధ్విని పీజీ వరకు చదివించా. నాకు వితంతు పింఛన్‌ మంజూరైంది. అప్పుడు రూ.200 ఇచ్చేవారు. తర్వాత రూ.2 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో పింఛన్‌ డబ్బులు తీసుకోవాలంటే పనులు మానేసి, పంచాయతీ ఆఫీసు వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. పింఛన్‌ కోసం కూలి పనుల్ని వదులుకున్న రోజులూ ఉన్నాయి.

 జగనన్న ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ రూ.3 వేలకు పెరిగింది. వలంటీర్‌ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికొచ్చి మరీ పింఛన్‌ డబ్బులు అందిస్తున్నారు. మా అబ్బాయికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ.15 వేలు లబ్ధి కలిగింది. టైలర్లకు ప్రభుత్వం ప్రకటించిన జగనన్న చేదోడు పథకం ద్వారా ఏటా రూ.10 వేలు చొప్పున బ్యాంక్‌ ఖాతాలో జమవుతోంది. వైఎస్సార్‌ ఆసరా ద్వారా ఏటా రూ.3 వేలు చొప్పున అందింది. ప్రభుత్వం అందిస్తున్న సాయం, కుట్టు మిషన్‌ ద్వారా వస్తున్న ఆదాయంతో ఆనందంగా బతుకుతున్నా. మాలాంటి పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న జగనన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. 
– మేరువ బుజ్జమ్మ, సిద్దవటం (పాలెం శ్రీనివాసబాబు, విలేకరి, సిద్దవటం)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement