కర్కాటక రాశి ఫలాలు 2022-23 | Sri Subhakrut Nama Samvatsara Cancer Horoscope 2022-23 | Sakshi
Sakshi News home page

కర్కాటక రాశి ఫలాలు 2022-23

Published Sat, Apr 2 2022 5:06 AM | Last Updated on Sat, Apr 2 2022 10:54 AM

Sri Subhakrut Nama Samvatsara Cancer Horoscope 2022-23 - Sakshi

పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)
ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)

సంవత్సరం గురువు ఏప్రిల్‌ 13 వరకు కుంభం (అష్టమం)లోను తదుపరి మీనం (భాగ్యం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్‌ 28 వరకు జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (సప్తమం)లోను మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్‌ 12 వరకు రాహువు వృషభం (లాభం) కేతువు వృశ్చికం (పంచమం)లోను తదుపరి రాహువు మేషం (దశమం), కేతువు, తుల (చతుర్థం)లోను సంచరిస్తారు.

2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (లాభం)లో స్తంభన. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా ప్రతి వ్యవహారంలోనూ ఆలస్యం జరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అనుకూల స్థితిని అందుకోగలుగుతారు. కుటుంబసభ్యులు సహకారంగా ఉన్నా, వారికీ మీకు మధ్య అవగాహన లోపం వస్తూనే ఉంటుంది. మిత్రులలోనూ బంధువులతోనూ కూడా కొన్ని సందర్భాలలో అనుకూలత, కొన్ని సందర్భాలలో ప్రతికూలత ఉంటుంది.

ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. కుజస్తంభన ఈ రాశివారికి ఇబ్బందికరం కాదు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. భోజనం, వస్త్రధారణ వంటి విషయాల్లో స్వేచ్ఛాప్రవర్తన కలిగి ఉంటారు. ఉల్లాసవంతంగా విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో కాలక్షేపం చేస్తారు. ఋణములు అవసరం ప్రకారం అందుకుంటారు. అదేరీతిగా మీరు తీర్చవలసిన ఋణములు కూడా అనుకూలమే. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిరీత్యా వృద్ధి, గత సమస్యలు పరిష్కారమవుతాయి. సుఖ జీవనం సాగిస్తారు.

వ్యాపారులకు పనివాళ్లతో సమస్యలు ఎదురవుతాయి. స్వయం నిర్ణయాలు, వ్యవహారాలు చేసే వ్యాపారులకు సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ఉద్యోగులకు తోటివారితోనూ, కింద పనిచేసేవారితోనూ అనుకూలత తక్కువ. అధికారుల అండదండలతో అన్నివిధాలా మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. వాత, నాడీ, చర్మ సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. శని సంచార ప్రభావంతో చిన్న చిన్న సీజనల్‌ ఇబ్బందులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో గురువు మీనంలో సంచరించే కాలం అనుకూలం. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి మంచి సలహాలు, సహకారం లభిస్తాయి.

విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి కాలం. విద్య ఉద్యోగం రెండు అంశాలలోను కాలం అనుకూలం. షేర్‌ వ్యాపారులకు ఫైనాన్స్‌ వ్యాపారులకు గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ జాగ్రత్త అవసరం. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. అనవసర ఆందోళనలు పొందవద్దు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా.. లాభదాయక ఫలితాలు ఉంటాయి. గర్భిణిలకు శని సంచారం అనుకూలం కాకున్నా, గురుబలం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.

పునర్వసు నక్షత్రం వారికి చాలా అద్భుతమైన వృత్తిలాభాలు అందుతాయి. సహజంగా అష్టమశని ప్రభావంగా ఇబ్బందులు రావాలిగాని, ఈ నక్షత్రం వారు ఇబ్బందులను దాటి చివరకు లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలు పూర్తి సానుకూలంగా సాగుతాయి.

పుష్యమి నక్షత్రం వారు ప్రతి అంశం బాగా ఆలోచించిన తర్వాతే ప్రారంభించాలి. విశేషం ఏమిటంటే ప్రయత్నించిన ప్రతి పనీ లాభదాయకంగా పూర్తి చేసుకుంటారు. కొన్నిసార్లు డబ్బునిల్వలు తగ్గి ఇబ్బంది పడతారు.

ఆశ్లేష నక్షత్రం వారు మానసిక ఒత్తిడి పొందుతారు. విశ్రాంతి కరువవుతుంది. పనులు పూర్తి చేసేలోపుగా కలçహాలు తలెత్తుతాయి. అయితే, చివరకు సత్ఫలితాలనే అందుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో అదుపు సాధించి,  గౌరవ మర్యాదలు అందుకుంటారు. గత సమస్యలు ఇంకా కొన్ని వుంటాయి.
శాంతి: శనికి శాంతి చేయించండి. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామి చుట్టూ రామనామం జపిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయడం ద్వారా శనిదోషం తగ్గి పనులు వేగం పుంజుకుంటాయి. ‘గౌరీశంకర’ రుద్రాక్ష ధరించండి.

ఏప్రిల్‌: ద్వితీయార్ధంలో శని కుజ శాంతి చేయించండి. ప్రతిపనీ ఆలస్యంగా పూర్తవుతుంది. కోపం నియంత్రించుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి విషయంలోనూ సమయపాలన చేయలేని స్థితి ఉంటుంది. ఋణ చికాకులు ఉంటాయి.

మే: బహు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా జరగవు. ఈ నెల ద్వితీయార్ధం అనుకూలం. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం బాగుంటుంది. ఆర్థికంగా నెలాఖరులో అనుకూలం. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి.

జూన్‌: సరైన సమయానికి అన్నవస్త్రాలు కూడా సమకూరని స్థితి ఉంటుంది. ప్రతి విషయంలోనూ శ్రమ ఎక్కువ. వ్యవహార భయం వెంబడిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధనం వెసులుబాటు బాగుంటుంది. విద్యార్థులకు రైతులకు అనుకూలత తక్కువ.

జూలై: చక్కటి కాలం. అష్టమ శని, సప్తమ శని ఉన్నా, కుజ గురు శుక్రుల అనుకూలత వల్ల పనులు చక్కగా పూర్తవుతాయి. చివర్లో కొంచెం చికాకులు ఎదురైనా, మొత్తం మీద పనులు వేగంగా సానుకూలంగా పూర్తి కాగలవు. సమయం వృథా చేయకుండా ముందుకు వెళ్లండి. అనవసర ఆందోళనలు వద్దని సూచన.

ఆగస్టు: మనశ్శాంతిగా ఉంటారు. కోరికలకు తగిన విధంగా ప్రవర్తించుకునే అవకాశాలు ఉన్న కాలం. అన్నింటా విజయం సాధిస్తారు. ప్రత్యేకంగా గత సమస్యలకు ఈ నెలలో పరిష్కార మార్గాలు లభిస్తాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం.

సెప్టెంబర్‌: 15వ తేదీ వరకు తెలివి, ఓర్పు ప్రదర్శనతోనూ, ఆ తదుపరి ధైర్యంతోనూ పనులు సానుకూలం చేసుకుంటారు. సమస్యలను ముందుగా గుర్తిస్తారు. 15వ తేదీ తర్వాత కొత్త ప్రయోగాలు చేయకండి. వృత్తి విషయాలలో కిందివారి సహకారం సరిగా ఉండదు కాని, అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది.

అక్టోబర్‌: అవకాశం కోరిక ఉంటే స్థానచలన ప్రయత్నాలు ఈ నెల 15వ తేదీ నుంచి చేయండి. శని దోషంతో పాటు అనుకూలించే గ్రహాల ప్రభావం వల్ల ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా క్రమంగా కుటుంబ, ఆర్థిక సమస్యలు నెమ్మదిగా సద్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. శని కుజులకు ఈ నెలలో శాంతి అవసరం.

నవంబర్‌: 13వ తేదీ నుంచి పనులు వేగంగా సాగుతాయి. శనిదోషం ఉన్నప్పటికీ మిగిలిన గ్రహచారం అనుకూలంగా ఉన్నందున పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆసక్తికర అంశాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అంతా సానుకూల వాతావరణమే ఉంటుంది. మొత్తం మీద ఈ నెల అంతా మంచికాలమే.

డిసెంబర్‌: పనులు ఆలస్యమైనా, ఇబ్బంది లేకుండా సాగుతాయి. తెలివిగా ప్రతి పనిలోనూ లబ్ధి పొందుతారు. 15వ తేదీ నుంచి రవి అనుకూలత, నెలంతా కుజుడి అనుకూలత వల్ల ధైర్యంగా ఉంటారు. స్నేహితులతో జాగ్రత్తలు వహించాలి. ప్రయత్నం చేసినా ప్రతి పనిలోనూ ఏదో ఒక రూపంగా లాభమే ఉంటుంది.

జనవరి: పరిస్థితి ఎలా ఉన్నా, చాలా విషయాల్లో 15వ తేదీ వరకు బాగా ధైర్యంగా ఉంటారు. ఆ తర్వాత చిన్న చిన్న అధైర్య లక్షణాలు బయటపడతాయి. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఏ పనీ చేయవద్దు. ఎవరికీ ఏ విధమైన హామీలు ఇవ్వవద్దు. కొత్త ఋణాలు చేయవద్దు.

ఫిబ్రవరి: అంతా బాగున్నట్లు గోచరిస్తుంది కాని, ఏవో తెలియని సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా ఉంటాయి. ఏ పని మీదా దృష్టి సారించలేరు. భోజన వస్త్రధారణ విషయాల్లో పరిస్థితులు మీ కోరికకు తగినట్లుగా ఉండవు. ఉద్యోగ భద్రతపై తెలియని భయం ఉంటుంది.

మార్చి: కోర్టు గొడవలు ఉన్నవారు చాలా విచిత్ర సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో ధన సమస్య ఎదురవుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు బాగా చికాకులు కలిగించేవిగా ఉంటాయి. అందరితోనూ విభేదాలు ఉంటాయి. వాహన అసౌకర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం.

మీ జాతకానికి ఈ గోచారం మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర 2022 – 23:  మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement