ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)
హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)
చిత్త 1,2 పాదములు (పే, పో)
ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (షష్ఠం)లోను తదుపరి మీనం (సప్తమం)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (పంచమి)లోను మిగిలిన కాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (భాగ్యం) కేతువు వృశ్చికం (తృతీయం)లోను తదుపరి రాహువు మేషం (అష్టమం), కేతువు తుల (ద్వితీయం)లోను సంచరిస్తారు.
2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (భాగ్యం)లో స్తంభన. ఈ గోచార ప్రభావం వల్ల ఏప్రిల్ నుంచి అనవసర భయాందోళనలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కావలసిన పనులు చేయడం కంటే అనవసర వ్యవహారాలపై దృష్టి పెంచడం వల్ల అవమానాలు ఎదురవుతాయి. కింది ఉద్యోగులు, పనివారి వల్ల చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. గురువు మీన సంచారం ప్రారంభమైనప్పటి నుంచి కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది.
ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు.
కొన్ని సందర్భాల్లో ఇతరులకు మేలు చేసినా, మీకు కీడు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. రోజువారీ విషయాలలో అన్న వస్త్రాల విషయంలో కూడా పరిస్థితులు అసంతృప్తికరంగా ఉంటాయి. సమయపాలన లేక రోజువారీ పనుల్లోనూ చికాకులు పెరుగుతాయి. స్థానచలన ప్రయత్నాలను స్వయంగా చేసుకోకపోతే అనుకూలత లేని చోటుకు చేరుకోవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సామరస్య ధోరణిని అవలంబించి సానుకూలత సాధిస్తారు. ఋణసౌకర్యం ఏప్రిల్ నుంచి నాలుగు నెలలకాలం అనుకూలం. అయితే దూరప్రయాణాలు చేయవద్దని ప్రత్యేక సూచన. గత సంవత్సరం కంటే కొన్ని అంశాలలో మంచి ఫలితాలు అందుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. చేస్తున్న వ్యాపారంలో మార్పులు చేసుకోవచ్చు గాని, చేస్తున్న వ్యాపారం మానడం, మారడం వద్దు. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమకు తగిన ఫలితాలు ఉండవు. అయినా ఓర్పుగా ముందుకు సాగవలసిన అవసరం ఉంది.
ఉద్యోగులు సమయానికి తగిన విధంగా ప్రవర్తించలేక ఒత్తిడికి లోనవుతారు. అధికారులతో తరచు ఇబ్బందులు వస్తాయి. అయినా నష్టం లేకుండా వీలయినంతవరకు లాభసాటిగానే ఉంటారు. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. అయితే ఏదో అనారోగ్యం ఉందేమోననే భావనతో అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబసభ్యుల కోసం కూడా అనవసర అపోహలతోనే వైద్య ఖర్చులు ఎక్కువవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లలో మే నెల తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని అంశాల్లోనూ అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. అయినా కార్యసాఫల్యం ఉంది.
విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి, సానుకూలంగా ఉంటుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనవసర చికాకులు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. ఇతర వ్యాపకాలు తగ్గించుకోవాలి. రైతులకు సొంత నిర్ణయాలతో చేసే వ్యవసాయం లాభాన్ని ఇస్తుంది. ఇతరుల సలహాలు వద్దు. గర్భిణీస్త్రీలు ఏప్రిల్ నుంచి రాహు ప్రభావం వల్ల ఒత్తిడికి లోనవుతారు. జాగ్రత్తలు పాటించాలి.
ఉత్తరా నక్షత్రం వారికి కాలం బాగా అనుకూలిస్తుంది. ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ విషయంలో చాలా విశేషంగా దృష్టి కేంద్రీకరించి, బంధుమిత్రులకు దగ్గరవుతారు. వృత్తిపరంగా ప్రశాంతతను పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.
హస్త నక్షత్రం వారు ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. మీ పనుల్లో సహాయం కోసం ఎవరినీ అర్థించవద్దు. వ్యక్తిగత విషయాల్లో గోప్యత మీకు చాలా శ్రేయస్కరం. గతంలో చేసిన పొరపాట్లు తరచు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబంలో గౌరవానికి భంగం కలుగుతుంది.
చిత్త నక్షత్రం వారు అన్నవస్త్రాలు కూడా సరిగా అమర్చుకోలేనంతగా పనుల్లో తలమునకలై వుంటారు. భయం, అగౌరవం, శ్రమకు తగిన లాభం లేకపోవడం నిరాశ కలిగిస్తాయి. మితిమీరిన పని తప్పించుకోవడం కుదరక సతమతమవుతారు. గతం కంటే పరిస్థితి బాగుంటుంది.
శాంతి: గురువుకు శాంతి చేయించండి. ఏప్రిల్ 15వ తేదీ తరువాత రాహువుకు జపం చేయించండి. రోజూ ఉదయం ఎర్రటి పుష్పాలతో జగదాంబను అర్చించి, ఆ తర్వాతే రోజువారీ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి.
ఏప్రిల్: ఒక విచిత్రమైన అద్భుత మాసం ఇది. మంచి మార్పులు ప్రారంభమవుతాయి. అయితే అన్నీ లాభదాయకంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు క్రమంగా మెరుగుపడతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. గురు రాహువులకు శాంతి చేయించండి.
మే: అనుకూల ప్రతికూలతలు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేని స్థితి. అయినా ధైర్యంగా ఉంటారు. ఇతరుల విషయాలలో కలగజేసుకోవద్దు. కోర్టు వ్యవహారాలు, ఇతరుల వ్యవహారాలు ఇబ్బందులు కలిగిస్తాయి.. మితభాషణ అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. అందరితోనూ ఆచితూచి జాగ్రత్తగా ఉండటం అవసరం.
జూన్: రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. తరచుగా చెడు వార్తలు వింటారు. భోజన అసౌకర్యం తరచుగా ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బందికరమైన కాలం. కుటుంబ కలçహాలు రాకుండా జాగ్రత్తపడండి. ఖర్చులను నియంత్రించుకోవడం భవిష్యత్తుకు మంచిది. ప్రయాణాలు తగ్గించుకోండి.
జూలై: నెల ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమంగా అన్ని సమస్యలనూ చక్కదిద్దుకుంటారు. 15వ తేదీ నుంచి కొంత ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అష్టమ కుజుడి ప్రభావం ఇబ్బందికరం. కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఆర్థిక వెసులుబాటు ఏర్పడుతుంది. అవసరానికి కావలసిన ఋణాలు సాధిస్తారు.
ఆగస్టు: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగుంటాయి. ప్రతి పని బాగా ఆలోచించి చేస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. కొన్ని పెద్ద సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు.
సెప్టెంబర్: ఎంత తెలివి, ధైర్యం ప్రదర్శించినా 15వ తేదీ వరకు వ్యవహార సానుకూలత తక్కువనే చెప్పాలి. 15వ తేదీ తరువాత పనులు వేగం పుంజుకుంటాయి. ఆహార విహారాల్లోను, అధికారులతో జరిపే సంభాషణల్లోను జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు నియంత్రించలేరు. దూర∙ప్రయాణాలు తగ్గించుకోండి.
అక్టోబర్: చిన్న చిన్న చికాకులు మినహా మిగిలిన అన్ని అంశాలూ అనుకూలం. ఈ నెలలో కేవలం రవి సంచారం అనుకూలత తక్కువ. ధన ఋణ కుటుంబ అంశాలు అనుకూలం. అన్ని పనుల్లోనూ ప్రయత్నాలు ప్రారంభించగానే శుభ సూచనలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కాలం అనుకూలం.
నవంబర్: కొత్త కొత్త ప్రయోగాలు తలపెట్టవద్దు. అలంకరణ వస్తువుల విషయంలో ధనవ్యయం ఎక్కువవుతుంది. అందరినీ గౌరవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాంఘిక కార్యకలాపాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. పుణ్యకార్యాలపై దృష్టి సారిస్తారు.
డిసెంబర్: చాలా మంచి కాలమనే చెప్పాలి. అనుకోకుండా పనిలో శ్రమ తొలగుతుంది. చాలా విషయాల్లో సానుకూలత ఉంటుంది. దైవబలంతో విజయపరంపర బాగా సాగుతుంది. అందరూ బాగా సహకరిస్తారు. గౌరవిస్తారు. తరచుగా శుభకార్య పుణ్యకార్యాల్లోను, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లోను పాల్గొంటారు.
జనవరి: చివరి వారంలో చికాకు పడతారు కాని, 22వ తేదీ వరకు అంతటా విజయం సాధిస్తూ ముందుకు వెడతారు. రోజువారీ పనుల్లో ఏ సమస్యలూ ఉండవు. చివరి వారంలో స్నేహితులతో జాగ్రత్తలు పాటించాలి. ఇబ్బందికర పరిస్థితులను ముందుగానే గుర్తించి, వాటిని దాటవేస్తారు.
ఫిబ్రవరి: శుక్ర సంచారం సరిగాలేదు. కుటుంబ విషయంలో చికాకులు రాగలవు. ఆర్థిక వెసలుబాటు బాగానే ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఖర్చులు పెరిగినా, తగిన ఆదాయం, ఋణసౌకర్యం చేకూరుతాయి. విద్యా ప్రదర్శన, విజ్ఞాన ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ధన ధాన్యలాభం చేకూరుతుంది.
మార్చి: సర్వసాధారణంగా రోజువారీ కార్యములు చక్కగానే చేస్తుంటారు. అయితే ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నష్టములు ఉండవు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలరుగాని, పనులు పూర్తయ్యేంత వరకు మానసికంగా చికాకులు పొందుతారు. ఆర్థిక వెసులుబాటు అనుకూలం. ఋణ సదుపాయము అనుకూలం.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment