● కలగా మినీ రిజర్వాయర్ నిర్మాణం ● బడ్జెట్‌లో పైసా కేటాయించని కూటమి ప్రభుత్వం ● 5 వేల ఎకరాలకు చెందిన రైతులు ఎదురుచూపులు
భవనాశి చెరువు
అద్దంకి: బాపట్ల జిల్లాలోని శింగరకొండలో బ్రిటిష్ కాలంలో 250 ఎకరాల్లో తవ్వించిన భవనాశి చెరువు ఉంది. దీని కింద ఇప్పటికే హైలెల్, లో లెవెల్, ప్లగ్‌హోల్ కాలువలు ఉన్నాయి. దక్షిణ అద్దంకిలోని నర్రావారిపాలెం, వేలమూరిపాడు, మణికేశ్వరం, గోపాలపురం, చక్రాయపాలెం గ్రామాల్లో 1,197 ఎకరాల మాగాణి భూమికి నీరు అందుతోంది. గతంలో ఈ చెరువు పల్లంలో ఉండడంతో పరిసర గ్రామాల కొండలపై నుంచి వచ్చిన వర్షపు నీటితో కలకళలాడుతుండేది. కొన్నేళ్ల నుంచి చెరువులో నీరు చేరడం తగ్గిపోయింది. సాధారణ సాగు అంతంతమాత్రంగా మారింది. ఈ క్రమంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా భవనాశి చెరువుపై దృష్టి సారించారు. బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం దగ్గర గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నీటిని ఫీడర్ చానల్‌తో చెరువుకు తరలించడం ద్వారా మినీ రిజర్వాయరుగా మార్చాలని భావించారు. ప్రాజెక్టుకు రూ.27 కోట్లు కేటాయించి భూమి పూజ కూడా చేశారు. 2013లో ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. అప్పటి టీడీపీ సర్కారు పట్టించుకోకపోవడంతో తరువాత ప్రాజెక్టు వ్యయాన్ని రూ.45 కోట్లకు పెంచాల్సి వచ్చింది.
మూడు పనులుగా..
ఈ ప్రాజెక్టును మూడు పనులుగా విభజించారు. ఒకటి వెలమారిపాలెం వద్ద చెక్ డ్యామ్, రెండోది భవనాశి కట్ట ఎత్తు పెంచడం, మూడో పనిగా భవనాశి చెరువుకు నీరు చేరేలా నది నుంచి ఫీడర్ చానల్ నిర్మించడం. అయితే ఇందులో ప్రస్తుతం చెక్‌డ్యామ్, చెరువు కట్ట ఎత్తు పెంచే పనులు పూర్తయ్యాయి. 12.6 కిలో మీటర్ల మేర తవ్వాల్సిన ఫీడర్ చానల్ పనులు మూడొంతులు మాత్రమే పూర్తయ్యాయి. చెరువు విస్తరణ పనులు పూర్తి కాలేదు. ఫలితంగా ప్రస్తుతం కాంట్రాక్టర్ క్లోజింగ్ ఇవ్వాలని వేడుకోలుతోపాటు ప్రాజెక్టు పూర్తి, భూ సేకరణకు మరో రూ.40 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపారు. సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో రూ.27 కోట్ల అంచనా పనులు ప్రస్తుతం రూ.వంద కోట్లు మించేలా ఉన్నాయి. రైతుల కలలు కల్లలుగానే మిగిలాయి.
మరో 5 వేల ఎకరాలకు లబ్ధి..
ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం సాగవుతున్న 1,197 ఎకరాలతోపాటు చెరువుకు తూర్పు భాగంలో ఏర్పాటు చేసిన తారకరామ ఎత్తిపోతల పథకానికి పుష్కలంగా నీరు అందనుంది. మొత్తం 5 వేల ఎకరాల మెట్ట భూములు మాగాణిగా మారుతాయి. ఇప్పటికై నా ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment