కిడ్నాప్, హత్యాయత్నం కేసులో నలుగురు అరెస్ట్
పరారీలో మరో నిందితుడు
తెనాలిరూరల్: కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన ఇద్దరు యువకులను కారులో కిడ్నాప్ చేసి తెనాలి తీసుకువచ్చి దాడి చేసి హత్యాయత్నం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెనాలి త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్‌బాబు తెలిపారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తెనాలి నందులపేటకి చెందిన మన్నే మణిదీప్‌కు కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన జానా సతీష్, మరికొందరితో ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు పండుతో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని మణిదీప్‌ను అడుగుతున్నాడు. డబ్బులు ఇస్తాను రమ్మంటూ సతీష్ అతని స్నేహితుడు పండు ఈనెల 14న విజయవాడ వచ్చారు. మణిదీప్, అతని స్నేహితులు ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదం, కోటా ప్రేమ్‌చంద్, బచ్చలకూర రమేష్‌బాబుతో కలిసి విజయవాడ వెళ్లి సతీష్, పండును కిడ్నాప్ చేశారు. కారులో తెనాలి తీసుకువచ్చి సుల్తానాబాద్ సమీపంలో ఒక గదిలో బంధించి తీవ్రంగా కొట్టడంతో పాటు వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. వారి బారి నుండి తప్పించుకున్న సతీష్, పండు త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో నలుగురుని అరెస్టు చేసినట్లు త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. బచ్చలకూర రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ ప్రకాశరావు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment