బాపట్ల: పేదల సేవలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చినగంజాం మండలం చిన్న గొల్లపాలెం గ్రామానికి రానున్నారని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీన సీఎం పర్యటన ఖరారు నేపథ్యంలో జిల్లా అధికారులతో సోమవారం స్థానిక పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన జయప్రదం చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. పర్చూరు నియోజకవర్గం పరిధిలోని చిన్నగంజాం మండలం పెదగంజాం రెవెన్యూ గ్రామం చిన్న గొల్లపాలెం గ్రామాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సందర్శిస్తారని చెప్పారు. తొలుత వృద్ధులు, ఒంటరి మహిళ, దివ్యాంగులైన లబ్ధిదారులతో మాట్లాడి, వారికి పింఛన్ పంపిణీ చేస్తారు. 45 నిమిషాలపాటు పింఛన్ లబ్ధిదారులతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గడుపుతారని కలెక్టర్ చెప్పారు. తదుపరి ఏర్పాటు చేసే ప్రజావేదిక ద్వారా ప్రజలనుద్దేశించి సభలో సీఎం ప్రసంగిస్తారన్నారు. సభ పూర్తి కాగానే ఒక గంటపాటు పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారన్నారు. తదుపరి జిల్లా అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం జయప్రదం అయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే చిన్న గొల్లపాలెం గ్రామాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్, ఆర్డీఓ, డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీ మరికొంతమంది అధికారులు పరిశీలించాలని కలెక్టర్ చెప్పారు. హెలీప్యాడ్ ప్రాంతం, పింఛన్ పంపిణీ చేసే లబ్ధిదారుల నివాస ప్రాంతం, సభా వేదిక, కార్యకర్తల సమావేశం, అధికారుల సమావేశ వేదికలను పరిశీలించాలన్నారు. తనిఖీ అనంతరం ఆ గ్రామంలో సామాజిక వనరులు, అవసరాలు, మౌలిక సదుపాయాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా తక్షణమే చేపట్టే అంశాలపై ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు తీరుపై సంక్షిప్త సమాచారంతో నివేదిక సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, ఆర్డీఓ పి.గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.
హాజరుకానున్న సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి