
లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలి
బాపట్ల: గృహ నిర్మాణాలలో లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు మంజూరు చేస్తున్న పక్కా గృహాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. లక్ష్య సాధనలో నిర్లిప్తంగా ఉండరాదన్నారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను లబ్ధిదారులు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. గృహ నిర్మాణాలలో చీరాల డివిజన్ పురోగతిలో లేకపోవడంపై సంబంధిత డీఈని ప్రశ్నించారు. గృహ నిర్మాణాలలో ప్రతివారం పురోగతి కనిపించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలలో చెరుకుపల్లి, కారంచేడు, చుండూరు, ఇంకొల్లు, పర్చూరు, వేటపాలెం మండలాలలో పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారులు పద్ధతి మార్చుకొని పనిచేయాలని హెచ్చరించారు. అద్దంకి, చీరాల, చినగంజాం మండలాలలో గృహ నిర్మాణ పనులు జరగకపోవడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలలో గృహ నిర్మాణాలు, ధ్రువీకరణ పత్రాల జారీ, బిల్లుల చెల్లింపులు, తదితరమైన వాటిపై ప్రతి వారం లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ మేరకు పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వర్లు, డీఈలు, ఏఇలు తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు
బాల్య వివాహాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను ఎవ్వరూ ప్రోత్సహించకూడదని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలను గమనిస్తే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగం సరైన చర్యలు తీసుకుని వాటిని ఆపడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వటం జరుగుతుందన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను గమనించి నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలోనూ విద్యార్థులకు బాల్య వివాహాలపై సదస్సులు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి గృహ నిర్మాణాలపై సమీక్ష