
రెస్టారెంట్లు, బిర్యాని పాయింట్లలో తనిఖీలు
చీరాల టౌన్: చీరాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్లు, బిర్యాని హోటళ్లలో ఆహార తనిఖీ భద్రతాధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఆహార తనిఖీల అధికారి ప్రభాకరరావు నేతృత్వంలో పట్టణంలోని దావత్, మిస్సమ్మ, రావుగారి బిర్యాని, గోదావరి రుచులు అనే పలావ్ పాయింట్లలో తనిఖీలు చేశారు. రెస్టారెంట్లు, పలావ్ పాయింట్లకు ఉన్న ఆహార లైసెన్సులతో పాటుగా కిచెన్, ఫ్రిడ్జ్‌ల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన చేపలు, రొయ్యలు, చికెన్, మసాలా దినుసులు, ఉల్లిపాయల పేస్టులు, పుదీనా చెట్నీలతో పాటుగా రంగు కోసం వినియోగిస్తు ప్రజలను రోగాల పాలు చేసే రంగుల డబ్బాలు, టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్లను చూసి విస్తుపోయారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడం, మూతలు లేకుండా కూరగాయలు, మసాల పౌడర్లుతోపాటుగా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తుండటంపై నిర్వాహకులను హెచ్చరించారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం, రొయ్యలు, చికెన్, పెరుగు, మంచూరియా, రంగు డబ్బాలు, టేస్టింగ్ సాల్ట్ ప్యాకెట్లను వ్యర్థ పదార్థాల డబ్బాల్లో పడేయించారు. ప్రజలను అనారోగ్యాలకు గురిచేసే రంగులను చికెన్, చేపలు, రొయ్యలకు పూసిన ముక్కలను శాంపిల్ సేకరించి నిర్వాహకులకు నోటీసులు అందించారు. శాంపిల్ ఫలితాలు వచ్చిన తర్వాత రెస్టారెంట్ నిర్వాహకులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లా ఆహార తనిఖీ అధికారి ప్రభాకరరావు మాట్లాడుతు...చీరాల పట్టణంలో ఉన్న రెస్టారెంట్లు, బిర్యాని హోటళ్లలో ఆహారంపై పలు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు యథేచ్ఛగా మాంసాహారాన్ని, వండిన అన్నం, ఇతర పిండి పదార్థాలు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి పేస్టులను, పొదినా చట్నీలను రోజుల తరబడి ఫ్రిడ్జ్‌ల్లో నిల్వ చేయడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే రెస్టారెంట్లు, హోటళ్లు నిబంధనల ప్రకారం తాజా మాంసాహారం, ఇతర పదార్థాలను వినియోగించాలని, నిల్వఉన్న ఆహారాన్ని వేడి చేసి, రంగులు అద్ది ఆహారం అమ్మకాలు చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార శాంపిల్ రిపోర్టులు వచ్చిన తర్వాత కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడుల్లో చీరాల డివిజన్ ఆహార తనిఖీ అధికారి ప్రణీత్, వినియోగదారుల సమాఖ్య ప్రతినిధి దాసరి ఇమ్మానియేల్, పాల్గొన్నారు.
నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు స్వాధీనం
శాంపిల్స్ సేకరణ

రెస్టారెంట్లు, బిర్యాని పాయింట్లలో తనిఖీలు