
ఆద్యంతం నవరసభరితం
రక్తి కట్టించిన ‘జనరల్ బోగీలు’
మార్టూరు : మార్టూరులో శ్రీకారం రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలలో భాగంగా రెండో రోజైన శుక్రవారం రాత్రి ప్రదర్శించిన మూడు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. ప్రదర్శనకు ముందు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకాశం జిల్లా చైర్మన్ ఏ.వి.బాబూరావు శ్రీకారం రోటరీ కళాపరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి నాటికలను ప్రారంభించారు. ‘వేదిక‘ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు ప్రదర్శనలలో పాల్గొన్న నటీనటులకు జ్ఞాపికలు అందజేశారు. సికింద్రాబాద్‌కు చెందిన మీనాక్షి సేతురామన్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ జి.వి.సేతురామన్, వసంత సేతురామన్ దంపతులు కళాకారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జేవీ మోహనరావు, శ్రీకారం కార్యదర్శి జాష్టి అనూరాధ, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుమాల కోటేశ్వరరావు, మాదాల సాంబశివరావు, ఈశ్వర ప్రసాద్, శానంపూడి లక్ష్మయ్య, గరివిడి శ్రీనివాసరావు, ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
మనిషిలోని అంతర్లీన కోణాలను
స్పృశించిన ‘(అ)సత్యం’
స్వార్థమైనా, నిస్వార్థమైనా, మంచి అయినా, చెడు అయినా, దైవత్వం అయిన, రాక్షసత్వం అయినా ఏదైనా సరే మనిషి హృదయానికి పరిమితమై ఉంటుంది. ప్రతి సత్యం వెనుక లేక అసత్యం వెనుక మనిషి స్వార్థం లేక భయం నిక్షిప్తమై ఉంటుంది. కంటికి కనిపించేదంతా సత్యం కాదు అలాగని కనిపించనిదంతా అసత్యం కూడా కాదు. యదార్థం అయినా సరే ఒక చెడుకు దోహదపడితే అది అసత్యం. అబద్ధమైనా సరే అది ఒక మంచికి దోహదపడితే అది సత్యం. ఏది సత్యం? ఏది అసత్యం? అంటూ ప్రేక్షకులను ఆలోచింపజేసిన నాటిక శ్రీ చైతన్య కళా స్ర వంతి ఉక్కునగరం విశాఖ వారి ‘(అ)సత్యం ‘నాటిక. ఎం శ్రీ సుధరచించిన ఈ నాటికకు బి.బాలాజీ నాయక్ దర్శకత్వం వహించారు.
మహిళల మనోగతాలకు దర్పణం పట్టిన ‘ఋతువు లేని కాలం’
స్వేచ్ఛ పేరిట ఉమ్మడి కుటుంబ వ్యవస్థలను, పురుషాధిక్యతా శృంఖలాలను తెంచుకుంటున్నామంటూ తమకు తామే బానిసలుగా మారుతున్న నేటి మహిళల పోకడను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన నాటిక కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘ఋతువులేని కాలం’. అపరిమితమైన ఆర్థిక స్వేచ్ఛతో ఆడంబరాలకు, ఫ్యాషన్లకు బానిసలౌతూ సంస్కృతీ సాంప్రదాయాలకు వక్ర భాష్యం చెప్పడం, మేము అనే భావన నుండి నేను మాత్రమే అనే భావన పెరుగుతూ ఒంటరితనానికి దగ్గరవుతున్న మహిళల అంతరంగాలను ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ప్రదర్శించారు నాటికలోని నటీనటులు.
మార్టూరులో రెండవ రోజు
అలరించిన పరిషత్తు నాటికలు
రైలు ప్రయాణం అందరికీ ఇష్టమైనది, సౌకర్యవంతమైనది. అయితే సామాన్యుడి నుంచి సగటు మధ్యతరగతి ప్రజల వరకు రైలులో జనరల్ బోగీలలో తక్కువ ఖర్చు కారణంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా జనరల్ బోగీలను పెంచాల్సిన రైల్వే శాఖ క్రమేపీ బోగీలను తగ్గిస్తూ ఉండటంతో రైలులోని బాత్‌రూములు, మరుగుదొడ్లలో సైతం ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణం చేయాల్సిన దుస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. తరచూ సంభవించే రైలు ప్రమాదాలలో జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణికులు మరణించిన సందర్భాలలో వారి చిరునామాలు రైల్వే శాఖ వద్ద ఉండని విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాంటి ప్రమాదంలో తన కొడుకును దూరం చేసుకున్న ఓ తల్లి సావిత్రమ్మ రైల్వే శాఖతోపాటు ప్రజాప్రతినిధులకు ఉత్తరాల ఉద్యమం ప్రారంభించి సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిందన్న ఇతి వృత్తంతో సాగిన నాటిక శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు ప్రదర్శించిన‘ జనరల్ బోగీలు‘. పి.టి.మాధవ్ రచించిన ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. నాటికలో సావిత్రమ్మ పాత్రధారిగా నటించిన సీనియర్ నటి సురభి ప్రభావతి తన నటనా కౌశలంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆద్యంతం నవరసభరితం