పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలు దిగజారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవార ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి హయాంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గిందని ఆరోపించారు. నాడు విద్యా సంస్కరణలతో పాటు అమ్మఒడి వంటి అనేక పథకాలతో జగనన్న అత్యుత్తమ ఫలితాలు రాబట్టారని తెలిపారు.
నేడు ఆయా పథకాలన్నీ అటకెక్కించి పేద విద్యార్థులను చదువుకు దూరం చేశారని ఆరోపించారు. 2024లో మొత్తం 2,800 పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. 2025లో అది 1,680 పాఠశాలలకు పడిపోయిందని తెలిపారు. గతంతో పోలిస్తే 5.5 శాతం తక్కువ ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియంపై కక్ష, యూపీ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల తొలగింపు వంటి అస్తవ్యస్తమైన నిర్ణయాల వలనే ఫలితాలు దారుణంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మరోవైపు గతేడాది సెప్టెంబర్ వరకు టీచర్ల సర్దుబాటు చర్యలతోనే విద్యా సంవత్సరంలో విలువైన సమయమంతా వృథా అయిపోయి ఫలితాలు అడుగంటాయని పేర్కొన్నారు.