రిజర్వేషన్లు కల్పించాల్సిందే..
జనాభా ప్రకారం
● రీ సర్వేతో మరింత పెరగనున్న బీసీల జనాభా ● రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఖమ్మంమయూరిసెంటర్: బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతమే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం కాకుండా జనాభా దామాషా ప్రకారం అమలుచేయాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఖమ్మంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రంలో బీసీలు 46 శాతం ఉన్నారని, రీ సర్వే చేయడంతో మరో రెండు శాతం పెరుగుతుందని చెప్పారు. ఈ మేరకు బీసీల జనాభా దాదాపు 48 శాతం ఉంటే ఏ ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారో చెప్పాలన్నారు. అంతేకాక ఒకే బిల్లు కాకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులు పెట్టాలని, ముస్లింలు, బీసీలకు కలిపి మొత్తం 56 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, రిజర్వేషన్ల విషయంలో హిందువులు, ముస్లింల నడుమ బీజేపీ చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రామాలు, కులాల వారీగా జనాభా, డెడికేటెడ్ కమిషన్ నివేదికను బయటపెట్టాలని, రీ సర్వేపై విస్తృత ప్రచారం చేయాలని ఆమె సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ బీసీల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, అందులో భాగంగానే పార్టీ పదవుల్లో బీసీలకు 51 శాతం అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ ఉంటే అభివృద్ధిలో భారత్ ఎప్పుడో అమెరికాను దాటిపోయేదని అభిప్రాయపడ్డారు. కాగా, తెలంగాణ జాగృతి సంస్థ బీసీలకు న్యాయం జరిగేవరకూ పోరాడుతుందని వెల్లడించారు. ఖమ్మంలో బీసీ భవన నిర్మాణం పూర్తికి బాధ్యత తీసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కోరారు. అనంతరం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, వివిధ సంఘాల నాయకులు మాట్లాడగా ఎంబీసీ నాయకుడు వీరన్న ప్రవేశపెట్టిన తీర్మానాలను ఆమోదించారు.
సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో..
ఖమ్మం పాండురంగాపురంలోని సంత్ సేవాలాల్ మందిరం, బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతించగా ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్, హరిప్రియతో కలిసి సంత్‌సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం కేసీఆర్ చలువేనని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే, ఇప్పుడు ముగ్గురు మంత్రులు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. అనంతరం బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు – కార్పొరేటర్ శ్రీవిద్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నాయకుడు గుండాల కృష్ణ నివాసాలకు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment