అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
●వారసత్వంగా వచ్చిన భూమిని సోదరుడి కుమారుడు ఆక్రమించాడని, విచారణ జరిపి తనకు ఇప్పించాలని దమ్మపేట మండలం బాలరాజుగూడెం గ్రామానికి చెందిన శ్రీరాముల బుచ్చిబ్రహ్మం ఫిర్యాదు చేశాడు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ దమ్మపేట తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.
●అనారోగ్యం ప్రజాపాలన గ్రామసభకు హాజరుకాలేదని, దీని వల్ల ఉచిత్ విద్యుత్, గ్యాస్ సబ్సిడీ కోల్పోయానని, తనకు ఆరు గ్యారంటీల పథకం వర్తించేలా చూడాలని కొత్తగూడెం మున్సిపాలిటీ చిట్టిరామవరానికి చెందిన బానోత్ రాములు కోరగా.. చర్యల నిమిత్తం విద్యుత్ శాఖాధికారులకు ఎండార్స్ చేశారు.
●అక్షర టౌన్‌షిప్ కొత్తగూడెం బ్రాంచిలో తాను డిపాజిట్ చేసిన సొమ్మును ఇప్పించాలని కొత్తగూడేనికి చెందిన ఆకుల నాగేశ్వరరావు ఫిర్యాదు చేయగా, దరఖాస్తును ఎస్పీకి ఎండార్స్ చేశారు.
పీఎం ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం
సూపర్‌బజార్(కొత్తగూడెం): అర్హులైన విద్యార్థులు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు నెలవారీ భత్యం రూ.5 వేలతోపాటు మరో రూ.6 వేలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి 12 నెలలని, 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి, కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండనివారు అర్హులని వివరించారు. 10, 12, తరగతులు, ఐటీఐ పాలిటెక్నిక్, డిప్లమా, డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://pminternship.mca.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 12 నుంచి మార్చి 11 వరకు దరఖాస్తు గడువని పేర్కొన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800116090కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment