● పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా ఆగని దొంగతనాలు ● పట్నం, పల్లె తేడా లేకుండా చోరుల హల్‌చల్ ● పోలీసులకు సవాల్‌గా మారిన వరుస చోరీలు ● అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జిల్లా
నిఘా ఉన్నా..
ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు పంచుకుంటోంది. సమీపంలోని ఒడిశా నుంచి కూడా జిల్లాకు రాకపోకలు ఎక్కువే. దీంతో అంతర్రాష్ట్ర సరిహద్దుగా భద్రాద్రి జిల్లా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లా మీదుగా సాగే గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ విభాగం నిరంతరాయంగా పని చేస్తోంది. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలతోపాటు భద్రాచలంలో ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను 24 గంటలూ నిర్వహిస్తోంది. మరోవైపు ఆపరేషన్ కగార్ కారణంగా బస్తర్ నుంచి జిల్లా మీదుగా మైదాన ప్రాంతాలకు వచ్చే అనుమానిత వ్యక్తులపైనా నజర్ పెట్టింది. ఇంత జరుగుతున్నా ఖాకీల కన్నుగప్పి దొంగలు తమ చేతి వాటం చూపించడం పోలీసులకు సవాల్‌గా మారింది.
ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా భావిస్తున్న పోలీసులు!
దోపిడీ దొంగలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి జిల్లాలో రెచ్చిపోవడం మొదలు పెట్టారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ కేంద్రంగా పంజా విసిరారు. ఫిబ్రవరి 7న నవభారత్ క్యాంపస్‌లో చొరబడి ఎనిమిది క్వార్టర్లలో రూ. కోటి వరకు సొత్తు లూటీ చేశారు. ఆ తర్వాత 9, 10వ తేదీల్లో కాంట్రాక్టర్స్ కాలనీలో చోరీలకు పాల్పడ్డారు. 13న రాహుల్‌గాంధీ నగరంలో చోరీకి యత్నించారు. దీంతో ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా భావించిన పోలీసులు విచారణ మొదలెట్టగా మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా చేసిన పనిగా అనుమానించి ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. దీంతో దోపిడీ ముఠాలు జిల్లాను వదిలి తమ స్వస్థలాలకు వెళ్లాయనే అభిప్రాయం కలిగింది.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే తాళం వేసిన ఇళ్లు, షాపులను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి నష్టానికి పాల్పడటం లేదు. ఎవరిపైనా భౌతికదాడులు చేయడం లేదు. సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించిన పోలీసులకు దొంగలు కారులాంటి వాహనాన్ని ఉపయోగిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. బీభత్సం సృష్టించకుండా తాము వచ్చిన పనిని సైలెంట్‌గా చేసుకుంటూ బలమైన ఆధారాలు చిక్కకుండా తప్పించుకున్న తిరుగుతున్న దొంగల భరతం త్వరగా పట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
గతంలోనే హెచ్చరికలు
ఇతర ప్రాంతాలకు చెందిన దోపిడీ దొంగలు జిల్లాకు వచ్చినట్టుగా గతేడాది చివరినాటికే పోలీసు శాఖకు స్పష్టమైన సమాచారం ఉంది. దీంతో రాత్రివేళలో అనుమానిత, అపరిచిత వ్యక్తుల కదలికల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఆటోలకు మైకులు పెట్టి మరీ ప్రచారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోనూ ప్రజలను పోలీసు శాఖ అప్రమత్తం చేసింది. దీంతో డిసెంబరు, జనవరిలో దొంగల పన్నాగాలు పెద్దగా పారలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment