అటు ఏపీ.. ఇటు తెలంగాణ
గోదావరి నడుమ కాకతీయుల నాటి ఆలయం
● గుట్టపై శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి క్షేత్రం ● ఈ నెల 26న కల్యాణానికి ముమ్మరంగా ఏర్పాట్లు ● ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదం కలిగించే పడవ ప్రయాణం
బూర్గంపాడు: పవిత్ర గోదావరి నది మధ్యలో ప్రకృతి అందాల నడుమ మోతెగడ్డ వీరభద్రస్వామి ఆలయం అటు ఆధ్యాత్మికతను ఇటు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇరువైపులా ఇసుక తిన్నెలు... గలగలా పారుతున్న గోదావరి జలాల మధ్యలో ఎత్తైన గుట్టపై కొలువైన వీరభద్రస్వామి ఆలయం రమణీయతను సంతరించుకుంది. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా స్వామివారిని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు. ఏజెన్సీలోని గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి కూడా శివరాత్రి రోజున స్వామివారి కల్యాణం వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. 600 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన ఆలయంలో ఈ నెల 26న భద్రకాళి సమేత వీరభద్రుని కల్యాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా గోదావరి ఇవతలి ఒడ్డున బూర్గంపాడు మండలంలోని మోతె గ్రామం ఉండగా, అవతలి ఒడ్డున ఏపీలోని ఎటపాక మండలం చింతలగూడెం ఉంటుంది.
శ్రీసూర్యభగవానుడే క్షేత్రపాలకుడు..
కాకతీయుల కాలం నాటి ఈ పురాతన శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయానికి శ్రీసూర్యభగవానుడు క్షేత్ర పాలకుడిగా ఉండటం విశేషం. సంతానం లేనివారు పవిత్ర గోదావరి నదిలో మూడుసార్లు స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రాణాసారం పట్టడం వల్ల సంతానం కలుగుతుందని పలువురు విశ్వసిస్తారు. శివరాత్రి పర్వదినం రోజు స్వామివారి కల్యాణానికి అవసరమైన తలంబ్రాల బియ్యాన్ని భక్తులు స్వయంగా వడ్లు వలిచి తయారుచేస్తారు. కల్యాణం ముందు రోజు స్వామివారు చింతలగూడెం నుంచి వీరభద్రుని గుట్టకు చేరుకుంటారు. శివరాత్రి రోజు తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, సర్వదర్శనం, విశేష అర్చనలు జరిపి, లింగోద్భవ కాలమునందు భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామివారి కల్యాణం ఘనంగా జరిపిస్తారు. మరుసటిరోజు అత్యంత పవిత్రమైన శ్రీరుద్ర గాయత్రి మహాయజ్ఞం వైభవోపేతంగా నిర్వహిస్తారు.
ఇలా వెళ్లాలి..
బూర్గంపాడు మండలంలోని సారపాక నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతె గ్రామం వెళ్లాలి. భద్రాచలం వెళ్లే ప్రతీ బస్సు సారపాక మీదుగా వెళ్తున్నందున భక్తులకు ప్రయాణం సులువుగా ఉంటుంది. సారపాక నుంచి మోతెకు శివర్రాతి రోజు ఆటోలు అందుబాటులో ఉంటాయి. భక్తులు గోదావరి ఒడ్డుకు చేరుకుని ఇసుకలో కొద్దిదూరం కాలినడకన వెళ్లాలి. అక్కడి నుంచి పడవలపై గుడికి చేరుకోవాలి. పడవలపై ప్రయాణం భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. గుట్టపై ఉన్న పురాతన ఆలయాన్ని దర్శించుకుంటే ఆధ్యాత్మికభావన కలుగుతుంది. భద్రాచలం వైపు నుంచి వస్తే బస్టాండ్‌కు సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో చింతలగూడెం(ఏపీ) చేరుకుని, ఇసుకలో నడుచుకుంటూ స్వామివారి గుట్టకు చేరుకోవచ్చు.
కల్యాణానికి ముమ్మర ఏర్పాట్లు
వీరభద్రస్వామి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తున్నాం. భక్తులకు తాగునీరు, స్నాన వాటికలు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నాం. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో భక్తులకు అన్నివసతులు కల్పిస్తున్నాం. గోదావరిలో గజ ఈతగాళ్లు, ఫైర్ అధికారులను నియమిస్తాం.
–సుదర్శన్, ఆలయ కార్యనిర్వహణాధికారి
అటు ఏపీ.. ఇటు తెలంగాణ
అటు ఏపీ.. ఇటు తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment