నేత్రపర్వం.. శత సహస్రం
● వైభవంగా హనుమాన్ చాలీసా పారాయణం ● ఏకరూప దుస్తులతో హాజరైన 3 వేల మంది భక్తులు ● వేడుకకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు
ఖమ్మంగాంధీచౌక్ : ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన శత సహస్ర హనుమాన్ చాలీసా పారాయణం నేత్రపర్వంగా సాగింది. శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు వివిధ ప్రాంతాలకు చెందిన మూడు వేల మందికి పైగా భక్తులు ఏకరూప దుస్తులు ధరించి హాజరయ్యారు. వేదికపై హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసి, ఉదయం 7:30 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ గణపతి పూజ, గోపూజ చేశారు. ఆ తర్వాత భక్తులు లక్ష హనుమాన్ చాలీసా (108 సార్లు) పారాయణం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 80 భజన మండళ్లు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. హాజరై న భక్తులకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి వలంటీర్లు పలు రకాల సేవలందించారు. పారాయణంలో పాల్గొన్న మూడు వేల మందితో పాటు ఇతరులకు కలిపి మొత్తంగా నాలుగు వేల మందికి అన్నదానం చేశారు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు..
ఖమ్మంలో నిర్వహించిన శత సహస్ర హనుమాన్ చాలీసా పారాయణానికి ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ అవార్డులు దక్కాయి. ఈ వేడుకను పరిశీలించాల్సిందిగా శ్రీ స్తంభాద్రి ఆద్యాత్మిక సమితి దరఖాస్తు చేయగా ఆవార్డు సంస్థలు హాజరయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పోందేలా కార్యక్రమం నిర్వహించారంటూ అభినందించిన సంస్థల ప్రతినిధులు ఈ రెండు అవార్డులకు ఎంపిక చేశాయి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కో–ఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్ శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావుకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సంస్థ బాధ్యులు గన్నవరపు నాగేశ్వరరావు, లగడపాటి రామారావు, ప్రతాపని నర్సింహారావు, కటకం చిన్న హనుమంతరావు, మోతుకూరి మురళీధర్, పుల్లఖండం సురేష్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గుండాల కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment