భూవివాదంలో ఇరువర్గాల దాడి
దమ్మపేట : భూవివాదాలతో సమీప బంధువులైన రెండు వర్గాలు మారణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్న ఘటన మండల పరిధిలోని చిన్న గొల్లగూడెం శివారులో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన కవులూరి సంజీవరావు కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి కవులూరి వెంకటేశ్వరరావు మరికొందరితో కలిసి అక్రమంగా ప్రవేశించి ఫెన్సింగ్ రాళ్లు, ఇనుప ముళ్లతీగను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో సంజీవరావు తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. పరస్పరం మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాల వారికి తల, ఛాతీ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కవులూరు వెంకటేశ్వరరావు, కవులూరి సంజీవరావు, వెంకటమ్మ , ఏసుబాబు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో దమ్మపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వెంకటేశ్వరరావు, సంజీవరావు, వెంకటమ్మలను మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment