కొలిక్కివచ్చిన స్థల సేకరణ!
25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్
రెసిడెన్షియల్ స్కూల్
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ స్థలంపై చిక్కుముడి వీడే అవకాశం ఉంది. మున్సిపల్ డంప్ యార్డు నుంచి రైల్వే లైన్ వరకు ఉన్న 25 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే అక్కడి రైతులు కొందరు ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. సదరు రైతుల చూపుతున్న భూమి ఆ సర్వే నంబర్‌లో లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే చేశారు. రెండు మూడు రోజుల్లో స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని సింగరేణి జీఎం వి.కృష్ణయ్య, తహసీల్దార్ కె.రవికుమార్ కలెక్టర్ జితేష్‌కు, ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వివరించారు. ఐటీఐ, ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలకు ఈ నెల 17న మంత్రులు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఆలోగా అధికారులు స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాల్సిఉంది. కాగా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సుమారు రూ. 200 కోట్లు, ప్రభుత్వాస్పత్రికి రూ.37 కోట్లు, ఐటీఐకి రూ.11 కోట్లు.. మొత్తం రూ.248 కోట్లను ప్రభుత్వం కేటాయించిన విషయం విదితమే.
ఇల్లెందు: నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ఐటీఐ, 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలకు స్థలాల ఎంపిక తుది దశకు చేరింది. ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇల్లెందులోని మెయిన్‌రోడ్‌లో ఉన్న సింగరేణి స్థలాలను స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పరిశీలించి సుముఖత వ్యక్తం చేశారు. కొందరు సింగరేణి ఉద్యోగులు క్వార్టర్లలో నివాసం ఉంటుండగా, వారిని మరోచోటకు తరలించాల్సి ఉంది. వారం పది రోజుల్లో సింగరేణి సీఎండీ నుంచి కూడా ప్రభుత్వ ఐటీఐ స్థలం కోసం అనుమతి వచ్చే అవకాశం ఉంది. మూడు ప్రధాన భవనాల నిర్మాణాలకు 35 ఎకరాల స్థలాల ఎంపిక దాదాపుగా ఒక కొలిక్కివచ్చింది.
నాన్‌వెజ్ మార్కెట్, సింగరేణి స్థలంలో
ఆస్పత్రి, ఐటీఐ
ఇల్లెందులో రూ.4.50 కోట్లతో గత ప్రభుత్వం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. నిధుల్లేక పనులు నిలిచిపోగా మరో వైపు పట్టణానికి దూరంగా ఉండటంతో ప్రజలు, వ్యాపారులు వచ్చే అవకాశం ఉండదని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పూర్తిగా నిలిపివేసింది. తాజాగా ఆ స్థలాన్ని ప్రభుత్వ ఐటీఐ భవనం కోసం కేటాయించాలని నిర్ణయించారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి ఉప్పిడి మిల్లు వరకు సుమారు అర కిలోమీటర్ మేర సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. వాటిలో 15 మంది సింగరేణి ఉపాధ్యాయులు, కార్మికులను అయ్యప్ప టెంపుల్ ఏరియా, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వెనుక ఉన్న ఖాళీ క్వార్టర్లకు తరలించనున్నారు. ఇక ప్రైవేటు వ్యక్తులను క్వార్టర్ల నుంచి ఖాళీ చేయించనున్నారు. మార్కెట్, సింగరేణి క్వార్టర్ల స్థలం కలుపుకుని రోడ్డు వెంట ఉన్న దాదాపు పదెకరాలను 100 పడకల ఆస్పత్రి, ఐటీఐల కోసం ప్రభుత్వం తీసుకోనుంది. దీంతో ప్రభుత్వాస్పత్రి, ఐటీఐ ప్రభుత్వ నడిబొడ్డున ఏర్పాటుకానున్నాయి.
ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రభుత్వాస్పత్రి, ఐటీఐలకు 35 ఎకరాలు గుర్తింపు
సుమారు రూ.248 కోట్లతో
మూడు ప్రధాన భవనాల నిర్మాణం
ఇల్లెందులో ఈ నెల 17న మంత్రులు శంకుస్థాపన చేసే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment