జేకే–5ఓసీ మూసివేత?
● ఓపెన్ కాస్టు గనిలో అడుగంటిన బొగ్గు నిల్వలు ● ఈ నెల 31తో ఉత్పత్తి నిలిపివేయనున్న సింగరేణి యాజమాన్యం! ● ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని కార్మికుల ఆందోళన
ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలోని జేకే–5 ఓసీ మూసివేసే దశకు చేరింది. ఓపెన్‌కాస్టు గనిలో బొగ్గు నిక్షేపాలు అడుగంటాయి. మార్చి, ఏప్రిల్ లోగా బొగ్గు వెలికితీత పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో యాజమాన్యం ఇక్కడి యంత్రాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. దీంతో కార్మికవర్గం ఆందోళన చెందుతోంది. ఇల్లెందు ప్రాంతంలో 1886లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు సమారు 10 వేల మంది కార్మికులు పనిచేశారు. క్రమంగా బొగ్గు గనులు మూత పడటం, కొత్త గనులు ప్రారంభించకపోవడంతో కార్మికుల సంఖ్య వందలకు చేరింది. బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఫిబ్రవరిలో ఇల్లెందు ఏరియా ఉత్పత్తి 51శాతానికి పడిపోయింది. దీంతో ఈ నెల 31తో జేకే–5 ఓసీలో ఉత్పత్తి పనులు నిలిపివేయాలని యాజమాన్యం భావిస్తోంది. 2023–24 వరకే జేకే ఓసీలో బొగ్గు వెలికితీతకు అనుమతులు ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవతో పూసపల్లి ఓసీ విస్తరణ జరిగే వరకు కొనసాగించాలని ముందుకు సాగారు. అయితే పూసపల్లి ఓసీ అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో షావల్, నాలగు డంపర్లను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలించారు. మరికొన్నింటిని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. యంత్రాలతోపాటు ఇతర ఏరియాలకు వెళ్లాలని మొదటి జాబితాలో సుమారు 15 మంది డంపర్ ఆపరేటర్లకు యాజమాన్యం తాఖీదులు ఇచ్చింది. కాగా ఇప్పటివరకు పూసపల్లి ఓసీపై కార్మికులు పెట్టుకున్న ఆశలు అడియాసలుగా మారాయి. ఈ నెల 18న మరోమారు జరగనున్న ఈసీ సమావేశంలోనైనా అనుమతులు లభిస్తాయని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 5న ఏఐటీయూసీ నేతలు సీఎండీని కలువనున్నారు. ఇల్లెందు మనుగడపై చర్చిస్తామని ఇల్లెందు ఏరియా బ్రాంచి కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు.
ఎమ్మెల్యే, ఐఎన్‌టీయూసీ నాయకుల ప్రయత్నం!
ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇక్కడి ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్‌టీయూసీ నాయకులు ఓసీ జీవితకాలం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం జీఎం, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఓసీని సందర్శించి పరిశీలిస్తామని, అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి జేకే ఓసీని కొంతకాలం పాటు కొనసాగించేలా చర్యలు తీసుకుంటారని ఐఎన్‌టీయూసీ నేత వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదే సమస్యపై ఐఎన్‌టీయూసీ నేత జనక ప్రసాద్ కూడా ఒకటి రెండు రోజుల్లో ఇల్లెందులో పర్యటించే అవకాశం ఉందని ఆ సంఘం నాయకుడు గోచికొండ సత్యనారాయణ తెలిపారు. ఓసీ పొడిగింపు వ్యవహారంపై డీజీఎం (పర్సనల్) జీవీ మోహన్‌రావును వివరణ కోరగా.. షావెల్, నాలుగు డంపర్‌లు మాత్రమే తరలించామని తెలిపారు. మార్చి తర్వాత కూడా మరో రెండు నెలలపాటు బొగ్గు వెలికితీస్తామని పేర్కొన్నారు. ఇటీవల డైరెక్టర్ కూడా ఓసీని సందర్శించి పరిశీలించారని, ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment