నైనీ.. మళ్లీ నిరాశే
నివేదికలకే పరిమితం..
రెండో దశ పర్యావరణ అనుమతులు వస్తేనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడం సాధ్యం అవుతుంది. 2021లో మొదటి దశ అనుమతులు రావడంతో 2022 – 23 ఆర్థిక సంవత్సరం నుంచే సాలీనా పది మిలియన్ టన్నుల బొగ్గును నైనీ బ్లాక్ నుంచి ఉత్పత్తి చేస్తామని సింగరేణి సంస్థ తన నివేదికల్లో పేర్కొంటోంది. కానీ మూడు ఆర్థిక సంవత్సరాలు గడిచినప్పటికీ రెండో దశ పర్యావరణ అనుమతులే రాలేదు. దీంతో ఇక్కడి నుంచి ఒక్క బొగ్గు పెళ్లను కూడా తవ్వి తీయలేకపోయింది. ఇక్కడ బొగ్గు తవ్వకాలు మొదలైతే ఆ తర్వాత దశలో థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా సింగరేణి ప్రాంరభించాల్సి ఉంటుంది. కానీ ఈ పనులన్నీ జరిగేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో అనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. నైనీతో పాటు గడిచిన మూడేళ్లుగా గోలేటి, రొంపేడు, వీకే మెగా ఓపెన్ కాస్ట్‌ల ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని సింగరేణి చెబుతూ వస్తోంది. కానీ ఈ గనుల పరిస్థితి కూడా నైనీ తరహాలోనే ఉంది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తక్కువ ఖర్చుతో ఎక్కువ బొగ్గు తవ్వి తీసేందుకు అవకాశం ఉన్న నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేయడంలో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు.. అన్నట్టుగా ఉంది సింగరేణి పరిస్థితి. బ్లాక్ దక్కించుకుని పదేళ్లు దాటినా ఇప్పటికీ అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమే కాలేదు.
తెలంగాణేతర ప్రాంతంలో..
తెలంగాణ బయట తొలిసారిగా బొగ్గు తవ్వకాలకు సింగరేణి సిద్ధమైంది. ఈ క్రమంలో ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న నైనీ కోల్‌బ్లాక్‌ను పిట్ హెడ్ మైన్‌గా 2015లో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే పదేళ్లు గడిచినా ఇక్కడ బొగ్గు తవ్వకాలు ఇప్పటికీ మొదలు కాలేదు. నైనీ బ్లాక్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించడానికే సింగరేణికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ తర్వాత పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నించేలోగా కరోనా విపత్తు వచ్చి పడింది. ఎట్టకేలకు 2021 అక్టోబర్‌లో తొలిదశ పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఇక కీలకమైన రెండో దశ పర్యావరణ అనుమతులు రావడమే తరువాయి అనే పరిస్థితి అప్పట్లో కనిపించింది.
అటవీ శాఖ క్లియరెన్స్..
నైనీ బ్లాక్ కోసం మొత్తంగా 912 హెక్టార్ల స్థలం సేకరించాల్సి ఉండగా ఇందులో అటవీ శాఖ పరిధిలోనే 783 హెక్టార్లు ఉంది. ఇందులో రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించిన స్థలం 643 హెక్టార్లు ఉంది. పైగా ఈ స్థలంలో ఎలిఫెంట్ కారిడార్ కూడా ఉండడంతో రెండో దశ అనుమతుల సాధన సంక్లిష్టంగా మారింది. దీనికి తోడు గత ప్రభుత్వం సరైన స్థాయిలో శ్రద్ధ చూపించలేదనే విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్టే మూడున్నరేళ్లు దాటినా ఇప్పటికీ రెండో దశ అనుమతులు మంజూరు కాలేదు.
ఏడాది దాటినా..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నైనీ బ్లాక్‌పై దృష్టి సారించారు. సింగరేణి ఉన్నతాధికారులు, సీఎండీ బలరాంనాయక్‌తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం రంగంలోకి దిగారు. నేరుగా ఒడిశా సీఎం, సీఎస్‌లతో చర్చలు జరిపారు. బొగ్గు తవ్వకాలతో అడవిలో నష్టపోయే చెట్లను గుర్తించడంతో పాటు అందుకు తగిన నష్టపరిహారం అంచనా వేసేందుకు చర్యలు ముమ్మరం చేస్తామని గతేడాది ఆగస్టులో ఒడిశా సర్కారు హామీ ఇచ్చింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు.
పదేళ్లుగా సాగుతున్న నైనీ బ్లాక్ వ్యవహారం
రెండోదశ పర్యావరణ అనుమతుల్లో జాప్యం
ఉత్పత్తి చేస్తామంటూ మూడేళ్లుగా చెబుతున్న సింగరేణి
ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కనిపించని పురోగతి
Comments
Please login to add a commentAdd a comment