సాగర్ ఆయకట్టుకు ‘సీతారామ’ నీరు
అశ్వాపురం : నాగార్జున సాగర్ ఆయకట్టు భూములు ఎండిపోకుండా గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీటిని అందింస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టను, నీటి మట్టాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ ఫేస్ –1 పంప్‌హౌస్‌ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను సాగర్ ఆయకట్టు పరిరక్షణకు కేటాయిస్తున్నామని చెప్పారు. అశ్వాపురం మండలం బీజీకొత్తూరు, ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురంలోని మూడు పంప్‌హౌస్‌ల ద్వారా 100 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు ప్రవహించి రాజీవ్ కెనాల్ నుంచి నాగార్జునసాగర్ కెనాల్‌కు మంగళవారం నాటికి మళ్లిస్తామని వివరించారు. తద్వారా సాగర్ చివరి ఆయకట్టు ఎంబీసీ మధిర బ్రాంచ్ కెనాల్, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు మండలాల చివరి ఆయకట్టుకు సాగర్ జలాలు పూర్తి స్థాయిలో అందుతాయన్నారు. అశ్వాపురం మండలంలో మారెళ్లపాడు ఎత్తిపోతల ద్వారా తుమ్మలచెరువుతో పాటు పినపాక నియోజకవర్గానికి వచ్చే పంట కాలానికి సాగునీరు అందిస్తామన్నారు. ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో కాల్వలు నిర్మించి ఆ ప్రాంతానికీ నీరందిస్తామని తెలిపారు. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వైరా ప్రాజెక్ట్, లంకాసాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు మధ్యలో ఉన్న సాగర్ ఆయకట్టును స్థిరీకరించి సుమారు 1.36 లక్షల ఎకరాలకు సీతారామ నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గండుగులపల్లిలో నాలుగో పంప్‌హౌస్‌ను పూర్తి చేస్తే దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు.
నేటి సాయంత్రానికి గోదావరి జలాలు..
ములకలపల్లి : నేటి (మంగళవారం) సాయంత్రానికి గోదావరి జలాలు ఎన్నెస్పీ కాల్వలోకి మళ్లించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మండలంలోని వీకే. రామవరం, కమలాపురంలోని పంప్‌హౌస్‌లను సోమవారం పరిశీలించి మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ)లో 100 కిలో మీటర్ల మెయిన్ కెనాల్, మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి చేసి, లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు పంప్‌హౌస్ –1 నుంచి నాలుగు రోజులుగా గోదావరి జలాలు ఎత్తిపోస్తున్నందున వీకే. రామవరం పంప్‌హౌస్–2కు సరిపడా నీళ్లు వచ్చాయని వివరించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు సూచించారు. సీతారామ కాల్వలకు అండర్ టన్నెల్స్ (యూటీ) ఏర్పాటు చేసి సమీప వాగుల్లోకి నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డిని అదేశించారు. ఆయా కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నీటి పారుదల ఎస్‌ఈ రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ రమేష్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నెల్లిపాక పీఏసీఎస్ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్ట్‌తో రెండు జిల్లాలు సస్యశ్యామలం
నాలుగేళ్లలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ
విభజన చట్టంలోని నీటి పంపకాలు, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 36 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినా నీటి పంపకాలు, నిధుల విడుదలలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. దీంతో దిగువ రాష్ట్రాలు ఎక్కువ నీరు వాడుకుంటున్నాయని, తెలంగాణకు నీరు రాక గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను నాగార్జున్‌సాగర్ ఆయకట్టుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విభజన చట్టంలో తాత్కాలిక పంపకాలైన 811 టీఎంసీల నీటిలో 511 టీఎంసీలు ఆంద్రా ప్రాంతానికి కేటాయించారని, మిగిలిన 300 టీఎంసీలు కూడా తెలంగాణకు ఇప్పించడంలో కేంద్రం నిరాసక్తత చూపిస్తోందని విమర్శించారు. కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన వాటాను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, దేశ ఆదాయంలో తెలంగాణ చెల్లించే సొమ్మే ఎక్కువనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment