ఎండలు ‘మండే’
● మార్చిలోనే భగ్గుమంటున్న సూర్యుడు ● 40 డిగ్రీలకు చేరువైన పగటి ఉష్ణోగ్రతలు ● బొగ్గు గనుల ప్రాంతాల్లో మరింతగా వేడి..
చుంచుపల్లి: మార్చి ఆరంభంలోనే భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లాలో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం ఏకంగా 39.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం పట్టణాల్లో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, కూడళ్లు ఎండల ప్రభావంతో మధ్యాహ్నం కొంతమేర నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత మూడు రోజులుగా ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లాలో శని, ఆది, సోమవారాల్లో 37 నుంచి 39.7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అదనంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా అంతటా ఎండవేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఇప్పటి నుంచే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు గనులకు కేంద్రంగా ఉన్న కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, ప్రాంతాల్లో మూడు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది.
40 డిగ్రీలకు చేరువలో..
జిల్లాలో మూడు రోజులుగా పగలంతా ఎండలు పెరుగుతున్నాయి. రాత్రి పూట కాసింత చలి పెడుతున్నా పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరులో పెరగాల్సిన ఎండలు ఈసారి ముందుగానే ముదరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అటు మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 20, 21 డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి. దీని ఫలితంగా గాలిలోని తేమశాతంలో తేడాలు వస్తున్నాయని వాతావరణశాఖ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పగలు ఎండ మండిపోతుండగా, రాత్రి నుంచి తెల్లవారే వరకు వాతావరణం కొంత చల్లగా ఉంటుందని చెబుతున్నారు. ఈసారి వేసవి ఆరంభంలోనే అదిరిపోయేలా ఎండలు కాస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇదే విధంగా ఎండలు పెరిగితే మరో రెండు రోజుల్లో 40 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు చేరువయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. పెరుగుతున్న ఎండల దృష్ట్యా వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment