
పెట్టుబడి భారమై..
ప్రోత్సాహం దూరమై..
● ఊతమివ్వని సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం ● భారంగా మారిన కూరగాయల సాగు ● ఈ ఏడాది ప్రత్యామ్నాయ పంటల వైపే రైతుల దృష్టి ● వినియోగదారులకు తప్పని ధరాభారం
ఇల్లెందురూరల్: కూరగాయల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా సబ్సిడీలు ఎత్తివేయడంతో జిల్లాలో ఆ పంటలపై రైతులు ఆసక్తి చూపడం లేదు. కేంద్రం గతేడాది సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం ప్రకటించినా అధికారులు అవగాహన కల్పించకపోవడంతో రైతులు ఇతర పంటలనే సాగు చేస్తున్నారు.
రోజుకు 266 టన్నులు..
జిల్లాలో 13.34 లక్షలకు పైగా జనాభా ఉంది. ఒక్కో వ్యక్తి నిత్యం 200 గ్రాముల చొప్పున జిల్లాలో 266 టన్నుల కూరగాయలు అవసరం. ఇందుకోసం సమారు మూడు వేల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గతంలో కూరగాయల సాగుకు సబ్సిడీపై నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు అందించారు. దీంతో రైతులు విస్తృతంగా సాగు చేశారు. 2016 నుంచి సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడడంతో సాగు 40 శాతానికి పడిపోయింది. గత నాలుగేళ్లుగా చీడపీడలు విజృంభించడంతో సాగు విస్తీర్ణం మరింత తగ్గిపోయింది. ఏటా 500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగయ్యే ఇల్లెందు మండలంలో గతేడాది పూర్తిగా పడిపోయింది. కాగా కేంద్ర ప్రభుత్వం 2024 వానాకాలం, ప్రస్తుత యాసంగి సీజన్‌కు సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం రాష్ట్రానికి రూ.145 కోట్లు కేటాయించి కూరగాయల సాగును ప్రోత్సాహించాలని నిర్ణయించింది. రాష్ట్రానికి మంజూరు చేసిన నిధుల్లో జిల్లాకు రూ.4.50 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు దీనిపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం లేదు. దీంతో జిల్లాలో కూరగాయల సాగు అంతగా లేక వినియోదారులపై భారం పడుతోంది.
ప్రోత్సహిస్తే కాకరసాగు..
కూరగాయల సాగులో కాకరను రైతులు తొలిపంటగా భావిస్తారు. ఏప్రిల్‌లో విత్తనాలు వేస్తే జూన్ రెండో వారం నుంచి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. ఈ పంట సాగుకు పందిరి వేసేందుకు గతంలో అడవి నుంచి వాసాలు తెచ్చి పందిర్లు వేసేవారు. ప్రస్తుతం వాసాల సేకరణకు అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. కనీసం వెదురు బొంగులు కూడా తీసుకురానివ్వడం లేదు. దీంతో రైతులు సిమెంట్ స్తంభాలు కొనుగోలు చేయలేక ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. గతంలో సిమెంట్ స్తంభాల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కానీ ఆ పథకం ప్రస్తుతం అమల్లో లేకపోవడంతో కాకర సాగు చేసే రైతులు పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.
ప్రోత్సాహకాలు పునరుద్ధరించాలి
మాకు కూరగాయల సాగు వారసత్వంగా వస్తోంది. దశాబ్దాలుగా ఈ పంటనే నమ్ముకొని జీవిస్తున్నాం. రాయితీ సౌకర్యాలు దూరం కావడం, చీడపీడలు అధికం కావడంతో ఇప్పుడు పంట సాగు భారంగా మారింది. సబ్సిడీలు పునరుద్ధరించి, మార్కెట్ సౌకర్యం కల్పిస్తే కొంతైనా మేలు జరుగుతుంది. – వాంకుడోత్ లింగా, అమర్‌సింగ్‌తండా,
ఇల్లెందు మండలం
ఉద్యాన అధికారుల
జాడేలేదు
దశాబ్దకాలంగా కూరగాయలు సాగు చేస్తున్నాం. గతంలో ఉద్యాన రైతులు నిరంతరం పర్యవేక్షించేవారు. మూడేళ్లుగా వారి జాడే లేదు. చీడపీడలు అధికమై, దిగుబడి తగ్గి గతేడాది సాగు నిలిపివేశాం.
– వాంకుడోత్ బాలు, కొమరారం,
ఇల్లెందు మండలం
ప్రతిపాదనలు సిద్ధం చేశాం
సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు మంజూరైన నిధులను బొప్పాయి, జామ, సీతాఫలం సాగుకు అత్యధికంగా కేటాయించాం. రెండు మండలాల్లో ఆరెకరాల విస్తీర్ణంలో కూరగాయల పందిరి సాగుకు మంజూరు చేశాం. మరింత మంది రైతులకు ప్రోత్సాహకాలు అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం.
– కిషోర్, జిల్లా ఇన్‌చార్జ్ ఉద్యాన అధికారి

పెట్టుబడి భారమై..

పెట్టుబడి భారమై..
Comments
Please login to add a commentAdd a comment